తిరువనంతపురం/కన్నూర్: సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన అయ్యప్పభక్తులకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మద్దతు ప్రకటించారు. అయ్యప్ప భక్తులను అరెస్టు చేస్తూ కేరళ ప్రభుత్వం రాష్ట్రంలో ఎమర్జెన్సీ మాదిరి వాతావరణం సృష్టించిందని ఆరోపించారు. కన్నూర్‌లో శనివారం బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించాక అమిత్ మాట్లాడారు. ఆందోళనకారులను నిర్బంధిస్తూ కేరళ ప్రభుత్వం నిప్పుతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని వామపక్ష ప్రభుత్వం హిందూ సంప్రదాయాలను నాశనం చేయడానికి చూస్తోందన్నారు. 10 నుంచి 50 ఏళ్ల వయస్సు అమ్మాయిలు, మహిళల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకున్నారన్న కారణంతో ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్‌పరివార్ కార్యకర్తలతోపాటు 2 వేల మంది భక్తులను అరెస్టు చేయడాన్ని అమిత్ ఖండించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలపై ఆంక్షలున్న అయ్యప్ప దేవాలయం ప్రత్యేకతను కాపాడుకోవాల్సి ఉందని అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలో శబరిమల అంశాన్ని పార్టీ ప్రధాన అజెండాగా తీసుకోనుందని స్పష్టం చేశారు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన స్వామి సందీపానంద గిరికి చెందిన ఆశ్రమంపై దాడి జరిగింది. కుండమోన్‌కదవు దగ్గర్లోని సాలగ్రామ ఆశ్రమంలోకి గుర్తు తెలియని వ్యక్తులు రెండు కార్లు, ఒక స్కూటర్‌కు నిప్పుపెట్టారు. శనివారం సీఎం విజయన్‌తోపాటు మంత్రులు థామస్ ఇసాక్, సురేంద్రన్ ఆశ్రమాన్ని సందర్శించి స్వామీజీతో మాట్లాడారు. ఈ దాడికి బీజేపీతోపాటు, శబరిమల ఆలయ ప్రధాన పూజారులు, పండాలం రాచ కుటుంబమే కారణమని సందీపానంద ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment