
సభలో మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పైనే ఆధారపడి ఉందని ఆయన రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే కర్నూలు జిల్లా సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధాపురం చెరువు వద్ద మంగళవారం గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తాను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోని చంద్రబాబుని చూసి మనిషి ఎలా ఉండకూడదో ప్రజలు నేర్చుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చెప్పే మాయమాటల్ని నమ్మవద్దని, వైఎస్సార్ ఆశయాల్ని తిరిగి బతికించే సత్తా వైఎస్ జగన్‌కే సాధ్యం అని కొనియాడారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సయన్వయంతో పనిచేయాలని కోరారు. జనం సమస్యల్ని పరిష్కరించడమే వైఎస్ జగన్ ఏకైక లక్ష్యం అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.