
‘ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదు. ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరూ అంతరాయం కలిగించొద్దు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ సభ్యుల వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభను హుందాగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ఒకసమయంలో.. ‘ఇదేమీ ఫిష్ మార్కెట్ కాదు. ప్రజలందరూ మనల్ని గమనిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరూ అంతరాయం కలిగించొద్దు’అని అసహనం వ్యక్తం చేశారు.
151 సభ్యులం ఓపికగా వింటున్నాం..
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జవాబుతో ప్రజల వద్ద దోషులుగా నిలబడాల్సి వస్తుందని టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడేటప్పుడు మా 151 మంది సభ్యులం ఓపికగా విన్నాం. కానీ, మేం చెప్పేది వినకుండా టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. సభలో టీడీపీ సభ్యులు రెచ్చిపోకుండా కంట్రోల్‌లో ఉండాలి. సభ సజావుగా సాగేందుకు సభామర్యాదలు పాటించాలి’
- చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
మీ పనులతోనే సంఖ్యను 23కు పరిమితం చేశారు...
సభలో టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు ఆర్డర్‌లో ఉండాలని కోరారు. సభలో గందగోళం సృష్టించొద్దని, క్రాస్‌టాక్ చేస్తే సభ సజావుగా జరగదని అన్నారు. ‘మీరు చేసిన పనులకు ప్రజలు మీ సంఖ్యను 23కు పరిమితం చేశారు. టీడీపీ రైతులకు ఏం అన్యాయం చేసిందో ప్రజలకు తెలుసు’అన్నారు.