
సాక్షి, హైదరాబాద్:ఆంధ్ర ప్రదేశ్‌లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని సీఎం కేసీఆర్ అభినందించడాన్ని తాను స్వాగతిస్తున్నానని, రాష్ట్రంలో చేపడుతోన్న సాగునీటి ప్రాజెక్టులపై జ్యుడీషియల్ కమిటీ వేసి, సమీక్షించిన తర్వాత అవసరమైతే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్తే మేఘా కంపెనీ 12.6% తక్కువకు కోట్ చేసిందని, ఇక్కడ కూడా అదే పద్ధతిని అనుసరిస్తే కనీసం 12% ఆదా అయ్యే దని చెప్పారు.
ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ.1.25 లక్షల కోట్లు చేయాల్సి ఉందని, ఈ మొత్తంలో 12% లెస్‌కు కాంట్రాక్టర్లు ముందుకు వస్తే రూ.28 వేల కోట్ల వరకు ఆదా అయ్యేది కదా అని ప్రశ్నిం చారు. మిషన్ భగీరథకు రివర్స్ టెండరింగ్ వర్తిం పజేస్తే మరో రూ.6వేల కోట్లు మిగులుతాయన్నా రు. రాష్ట్రంలో ఇరిగేషన్ టెండర్లలో పోటీ బిడ్డింగ్ జరగలేదని, అంతా అవగాహనతోనే జరుగుతోందన్నారు. రాష్ట్రంలో టెండర్ల విధానంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీనిపై తాము సీబీఐ విచారణ కోరుతామని చెప్పారు.