చంద్రబాబు ‘ఎర్ర’ నాయుడు | Bhumana Karunakar Reddy fires on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ‘ఎర్ర’ నాయుడు

Published Sat, Sep 1 2018 3:42 AM | Last Updated on Sat, Sep 1 2018 3:42 AM

Bhumana Karunakar Reddy fires on chandrababu - Sakshi

తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతున్న భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు

తిరుపతి సెంట్రల్‌: రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో 10 లక్షల ఎకరాల్లో ఎర్రచందనాన్ని కొల్లగొట్టి, అక్రమంగా రవాణా చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు తమ వాహనాల్లో ఎర్ర చందనాన్ని యథేచ్చగా తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. భూమన శుక్రవారం చిత్తూరు జిల్లా తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పచ్చచొక్కాలకు ఎర్ర చందనమే ఇంధనంగా మారనుందని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్మును వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయడానికి టీడీపీ సిద్ధమైందని విమర్శించారు. ‘‘ఎర్ర చందనాన్ని విక్రయించి రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఎర్రచందనం ద్వారా వచ్చిన సొమ్ముతో ఒక్క పైసా రుణం కూడా మాఫీ చేయలేదు. ఆఖరికి ఒక్క ఎర్రచందనం చెట్టు కూడా లేకుండా పచ్చదనాన్ని మాఫీ చేశారు. దేశంలోనే అత్యంతం అవినీతి రాష్ట్రం అనే ముద్ర పడేలా ఆంధ్రప్రదేశ్‌ను మార్చేశారు. చంద్రబాబు నాయుడు ఎర్ర నాయుడిగా మారిపోయారు. శేషాచలం కొండలు, వెలిగొండ, పాలకొండ, లంకమల కొండల్లో 1,500 కిలోమీటర్ల పరిధిలో, 35 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఎర్రచందనాన్ని పచ్చదండు కొల్లగొడుతోంది’’ అని భూమన దుయ్యబట్టారు.  

ఎర్రచందనం వేలంలో అక్రమాలెన్నో..
‘‘ఎర్ర చందనం విషయంలో కుట్ర దాగి ఉంది. ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంలో సి–గ్రేడ్‌ రకం కింద దక్కించుకున్న ఎర్ర చందనాన్ని ఎ–గ్రేడ్‌ ఎర్రచందనంగా కేంద్రం పరిధిలోని డైరెక్టర్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) సంస్థ గుర్తించింది. ఎ–గ్రేడ్‌ ఎర్రచందనం టన్ను ధర సగటున రూ.1.90 కోట్లుగా ప్రభుత్వం నిర్వహించిన వేలంలోని గణాంకాలే నిర్ధారిస్తున్నాయి. అంత ఖరీదైన ఎ–గ్రేడ్‌ ఎర్రచందనాన్ని అక్రమ మార్గంలో సి–గ్రేడ్‌ కింద  పరిగణిస్తూ ఒక్కో టన్ను రూ.15 లక్షలకే పతంజలి సంస్థ దక్కించుకుందన్న కోణంలో డీఆర్‌ఐ విచారణ సాగింది. ఎర్రచందనం వేలం అక్రమాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే. నాలుగున్నరేళ్లలో 25 సార్లకుపైగా ప్రభుత్వం వేలం నిర్వహించిందంటే అక్రమాలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

దేశం నుంచి తరలిపోతున్న ఎర్ర చందనంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. మరోవైపు ఎర్ర చందనం బహిరంగ వేలానికి నోచుకోకుండా ఎక్కడి నిల్వలు అక్కడే నిలిచిపోవడం వెనుక కూడా టీడీపీ సర్కారు కుట్ర దాగి ఉంది. వేలంలో ఒక టన్ను ధర రూ.2 కోట్ల దాకా పలుకుతుంటే.. మన రాష్ట్రంలో నిల్వలు ఎందుకు పెరిగిపోతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చైనా లాంటి దేశాలు ఎర్రచందనాన్ని ఎందుకు, ఏ రకంగా వినియోగిస్తున్నాయో కూడా మిస్టరీగా మారింది. ప్రభుత్వం చెబుతున్నట్టు ఫర్నీచర్, బొమ్మల తయారీకే పరిమితమైతే ఒక్కొ టన్ను ఎర్రచందనాన్ని రూ.2 కోట్లు ఖర్చు చేసి కొనాల్సిన అవసరం ఉండదు. మన రాష్రంలో రూ.2 కోట్లకు విక్రయిస్తే చైనాకు చేరే సరికి ధర రూ.5 కోట్లకు పెరిగిపోతోంది’’ అని కరుణాకర్‌రెడ్డి చెప్పారు. 

చట్టం కోసం ఒత్తిడి చేయరేం?
‘‘ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదు? ఎర్రచందనం మన ప్రాంతంలోనే ఎక్కువగా పెరుగుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టడానికి చట్టాలు పదునుగా లేవు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన చట్టం ఉంటేనే ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకోవచ్చు. మన ప్రాంతంలోనూ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో చిత్తశుద్ధి లేదు.

అటవీ శాఖ అధికారులకు పరిమిత అధికారాలే ఉన్నాయి. తగినంత మంది సిబ్బందిని, వాహనాలను, ఆయుధ సామగ్రిని సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. 1,500 కిలోమీటర్ల పరిధి, 35 లక్షల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో కేవలం 463 మంది సిబ్బందితో కూంబింగ్‌ చేయడం అసాధ్యం. ఎర్రచందనం కేసులో గంగిరెడ్డిని అరెస్టు చేసేశాం, అంతా అయిపోయిందని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఆ తర్వాత అక్రమ రవాణాను అడ్డుకోలేకపోయింది. అత్యంత విలువైన ఎర్రచందనం సంపదను భావితరాల కోసం పరిరక్షించాలి’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement