
సాక్షి, భోపాల్ : ఓ బీజేపీ నేతకు తీవ్ర అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనకు అనూహ్యంగా బూట్ల దండ వేసి స్వాగతం పలికారు. దీంతో అప్పటి వరకు హుషారుగా ప్రచారంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అనంతరం అది వారి కోపం మాత్రమేనని, తననుంచి వారు ఏదో కోరుకుంటున్నారని, అందుకే తమ అసంతృప్తిని అలా వ్యక్తం చేశారని అన్నారు. తానెప్పుడూ వారి బిడ్డనేనని, వారి అవసరాలు తీర్చేందుకు మరింత బాగా పనిచేస్తానని అన్నారు.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో థామ్‌నోడ్ అనే ప్రాంతంలో దినేశ్ శర్మ అనే బీజేపీ నేత ప్రచారానికి వెళ్లారు. ప్రతి ఇంటికి ఓట్లు అడిగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి చెప్పులతో దండను తీసుకొచ్చి వేయబోయాడు. దీంతో ఆయన వాటిని పక్కకు పడేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి అంతే తన ప్రయత్నాన్ని కొనసాగించడంతో ఇక తప్పదని చెప్పుల దండ వేయించుకున్నాడు. అనంతరం ఆ దండ వేసిన వ్యక్తి మాట్లాడుతూ తమ ప్రాంతంలో నీటి సమస్య అధికంగా ఉందని, ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఆ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకే తాను ఇలా చేశానని అన్నారు. ఇక దండ వేయించుకున్న బీజేపీ నేత దినేశ్ మాత్రం ఆ చర్యపట్ల తనకు ఎలాంటి కోపం లేదని అన్నారు. అయితే, ఈ సమస్యపై తాము మాట్లాడబోతున్నామని చెప్పారు.