
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో పరిణామాలు దర్శనమిచ్చాయి. శుక్రవారం ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డ తర్వాత.. పార్లమెంట్ ఆవరణలో అధికార-ప్రతిపక్షాలు పోటాపోటీ నిరసనలకు దిగాయి. ఇరుపార్టీల ఎంపీలు ఫ్లకార్డులు చేతబూని వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
ముందుగా కేంద్ర మంత్రులతో సహా బీజేపీ ఎంపీలంతా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. సభ నిర్వహణకు కాంగ్రెస్ అడ్డుతగిలిందని.. పూర్తి సెషన్స్ వృథా అయిపోయిందని ఆరోపిస్తూ ఫ్లకార‍్డర్లతో నినాదాలు చేశారు. మరోవైపు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇచ్చిన టీ ఆతిథ్యాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ.. అదే సమయంలో తమ నిరసన వ్యక్తం చేసేందుకు గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ఇరు పార్టీల నేతలు ఎదురెదురు పడ్డారు. బీజేపీ చేతగానీ తనం వల్లే సభ కార్యాకలాపాలు స్తంభించాయని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఒకనొక తరుణంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాసేపటికే ఇరుపార్టీల ఎంపీలు అక్కడి నుంచి నిష్క్రమించారు. (మోదీ సంచలన నిర్ణయం)
కాగా, ఇంతకు ముందు బీజేపీ ఇలాంటి ఆరోపణలను చేస్తూ కాంగ్రెస్, సోనియా గాంధీలపై తీవ్ర విమర్శలు గుప్పించింది. దీంతో గురువారం సభలో మాట్లాడిన సోనియా గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. సభను నిర్వహించటంలో విఫలమై.. ఆ నెపాన్ని తమపై నెడుతూ ఆరోపణలు చేయటం సరికాదంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌పై సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ ఏప్రిల్ 12న నిరహార దీక్ష చేపట్టాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని పిలుపునివ్వగా.. మత ఘర్షణలు, దళితులపై దాడులకు ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఏప్రిల్ 9వ తేదీనే దీక్ష చేపట్టబోతున్నారు.