
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే సిట్టింగ్ స్థానాలతో పాటు పార్టీ ప్రభావిత స్థానాల్లో ఎవరెవరిని పోటీలో దించాలన్న దానిపై ఓ స్పష్టతతో ఉన్న బీజేపీ నేతలు మిగతా స్థానాలపైనా దృష్టి సారించారు. ఆశావహుల బలాబలాలను అంచనా వేసి, గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న వారినే పోటీలో నిలపాలని యోచిస్తున్నారు.
అయితే అభ్యర్థులను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేయకుండా పార్టీ జాతీయ నాయకత్వానికి అభ్యర్థుల పేర్లను పంపి ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా అదే సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. వచ్చే నెలలో బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేసి, ప్రకటించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ నిర్వహించి, ప్రజాబలం ఉన్న వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టనుంది.
త్వరలో నియోజక వర్గ ఇన్‌చార్జులతో భేటీ
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల ముందుంచి తమ పార్టీ తరఫున పోటీలో ఉండే అభ్యర్థుల గెలుపునకు కృషి చేసే ప్రణాళికపై బీజేపీ నేతలు దృష్టి సారించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా త్వరలోనే నియోజకవర్గాల ఇన్‌చార్జులతో సమావేశం నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. దాంతో పాటు పోలింగ్ ఏజెంట్లకు వర్క్‌షాప్‌ల నిర్వహణ ఎలా ఉండాలన్న కోణంలో పరిశీలన జరుపుతోంది. అలాగే పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రంగా ఎస్సీ, బీసీల సమ్మేళనాలను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమ్మేళనాలను నిర్వహించాలన్న దానిపై దృష్టి పెట్టింది.
మొదటి వారం కరీంనగర్‌లో సభ..
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహాసభలను నిర్వహించేందుకు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ సభలకు ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 50 మందిని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయా సభల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అమిత్ షా బహిరంగ సభను వికారాబాద్‌లో పెట్టే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు. అక్టోబర్ మొదటి వారంలో కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. అనంతరం వరంగల్, హైదరాబాద్‌లోనూ బహిరంగ సభలను నిర్వహించే అవకాశముంది. ఇందులో ఒక సభలో ప్రధాని నరేంద్ర మోదీ, మరో సభలో అమిత్ షా పాల్గొనేలా చూడాలని భావిస్తోంది.
27న చేగుంటలో మహిళా సమ్మేళనం..
మహిళల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు దుబ్బాక చేగుంటలో ఈ నెల 27న మహిళా సమ్మేళనం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొననున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ పాలనలో వైఫల్యాలపై నియోజకవర్గాల వారీగా చార్జిషీట్ రూపొందించి, వాటిపై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగుల సమస్యలపై మండలాల వారీగా సభలు నిర్వహించడంతోపాటు హైదరాబాద్‌లో సత్యాగ్రహం నిర్వహించేందుకు బీజేపీ నేతలు చర్యలు చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment