బీజేపీ జాతీయ మండలి సమావేశం వేదికపై అమిత్ షా. చేతిలో కమలంతో మోదీ
న్యూఢిల్లీ, సాక్షి ప్రతినిధి: అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరుతామని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు కల్పిస్తోందని మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశ చరిత్రను మలుపు తిప్పిన మూడో పానిపట్ యుద్ధం వంటివన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ సాంస్కృతిక జాతీయ వాదానికీ, ప్రతిపక్షాల అధికార దాహానికి మధ్యనే జరగనున్నాయని తెలిపారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శుక్రవారం ఆయన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించి, ప్రసంగించారు.
‘అయోధ్యలో తొందరగా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలని పార్టీ పట్టుదలతో ఉండగా కాంగ్రెస్ అడ్డంకులు కల్పిస్తోంది. అయితే, బీజేపీ రామ మందిరాన్ని నిర్మించి తీరుతుంది’ అని అన్నారు. మందిర నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరేంటో స్పష్టం చేయాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ‘ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, అద్భుతమైన, పారదర్శక, కష్టపడి పనిచేసే నేత బీజేపీకి ఉన్నారు. 1987 నుంచి ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ప్రతిపక్షంలో ఆయనకు సరితూగగల నేత లేరు. మోదీ మాదిరిగా మరెవ్వరూ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు’ అని పేర్కొన్నారు.
వారంలో రెండు కీలక నిర్ణయాలు
మోదీ ప్రభుత్వం ఈ వారంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుందని అమిత్ చెప్పారు. ఒకటి.. జనరల్ కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం. రెండోది జీఎస్టీ మినహాయింపు పరిమితిని పెంచడం. జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ల ద్వారా కోట్లాది మంది యువత ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. దీంతోపాటు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిమితిని రెట్టింపు చేస్తూ రూ.40 లక్షలకు పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
దీని ప్రకారం రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్న వారు 1 శాతం పన్ను చెల్లించేలా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. అక్రమాలకు పాల్పడిన నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీవంటి వారు కాంగ్రెస్ హయాంలో దేశం విడిచి ఎందుకు పారిపోలేదు? కాంగ్రెస్ దేశంలో అవినీతిని ఎలా పెంచి పోషించిందో దీన్నిబట్టి స్పష్టమవుతుంది అని వ్యాఖ్యానించారు.
బీజేపీ హయాంలోనే ఈ ఆర్థిక నేరగాళ్లంతా ఎందుకు పారిపోయారు? ప్రధాని మోదీ చౌకీదార్ మాదిరిగా ఇలాంటి వారిని ఉపేక్షించబోరని అన్నారు.రైతులకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్న మోదీ సర్కారును ‘రైతు హిత’ ప్రభుత్వంగా పేర్కొంటూ బీజేపీ జాతీయ కౌన్సిల్ ఒక తీర్మానం ఆమోదించింది. దీంతోపాటు గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మరో తీర్మానం చేసింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లోని పార్టీ నేతలు కలిపి 14వేల మంది వరకు హాజరయ్యారు.
మోదీకి, మిగతా వారికి మధ్యనే పోటీ
ప్రధాని మోదీని ఓడించాలనే చౌకబారు ఎత్తుగడతోనే మహా కూటమి ఏర్పడుతోందనీ, ఈ కూటమికి ఒక విధానం కానీ, నాయకుడు గానీ లేరని అమిత్ అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసిన మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘వచ్చే సాధారణ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరాటంగా సాగనున్నాయి. సాంస్కృతిక జాతీయ వాదం, పేదల అభ్యున్నతే బీజేపీ పార్టీ లక్ష్యం కాగా, ప్రతిపక్షాలు అధికారమే పరమావధిగా ఏకమవుతున్నాయి’ అని పేర్కొన్నారు. ‘కూటమిలోని పార్టీలన్నీ 2014 ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైనవే. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి బీజేపీ 2014 ఎన్నికల్లో కంటే ఎక్కువ స్థానాలు సాధించడం ఖాయం’ అని విశ్వాసం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment