ఒకటీ రెండూ కాదు ఆరుసార్లు మేనకా గాంధీని పార్లమెంటుకు పంపిన ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి ఆమె కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తుండడంతో గెలుపెవరిని వరిస్తుందన్న చర్చ సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గాంధీ కుటుంబం నుంచి వచ్చి, గాం«ధీ కుటుంబేతర పార్టీ నుంచి తమకు తాముగా నాయకులుగా ఎదిగిన తల్లీ కొడుకులు ఉత్తరప్రదేశ్‌లో తమ విజయావకాశాలను పరీక్షించుకుంటున్నారు.
స్థానం మారిన తల్లీకొడుకు
ఉత్తరప్రదేశ్‌లోని పిలీభీత్ స్థానం నుంచి వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ 1989 నుంచి ఆరుసార్లు విజయం సాధించి, ఈ స్థానాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 52 శాతం ఓట్లను సాధించి మేనకా గాంధీ విజయఢంకా మోగించారు. అంతకు ముందు 2009 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి వరుణ్ గాంధీ పోటీచేసి, మూడు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తల్లీ కొడుకులు తమ నియోజకవర్గాలను పరస్పరం మార్చుకోవడం విశేషం. ఈసారి మేనకా గాంధీ స్థానంలో ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగారు. సుల్తాన్‌పూర్ నుంచి మేనకా గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో గెలుపు కైవసం చేసుకుని తల్లిపేరు నిలబెట్టాలని వరుణ్ పిలీభీత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మోదీ ప్రస్తావనే లేకుండా ప్రచారం
పశ్చిమ యూపీలోని ఈ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న వరుణ్ గాంధీ.. ప్రధాని మోదీ ప్రస్తావన, కేంద్ర ప్రభుత్వ విజయాల గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గ ఓటర్లలో ఒక వర్గం నరేంద్ర మోదీని చూసే బీజేపీకి ఓటు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా 30 ఏళ్లుగా ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబీకులు తమ అభివృద్ధి కోసం కృషి చేసిన దాఖలాలు లేవని విమర్శలు గుప్పిస్తున్నారు.
కూటమి అభ్యర్థి గట్టి పోటీ
ఈ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థి హేమరాజ్ వర్మ వరుణ్ గాంధీతో తలపడుతున్నారు. ఈయన ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. మూడు దశాబ్దాలకుపైగా తల్లీకొడుకులిద్దరూ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కానీ, కనీసం ఢిల్లీకి నేరుగా చేరుకునేందుకు రైల్వే సదుపాయం కానీ కల్పించలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను స్థానికుడిననీ, ఇక్కడి ప్రజలూ స్థానిక నాయకత్వాన్నే కోరుకుంటున్నారనీ, తల్లీ కొడుకులు ఒక నెల సెలవుపై ఎన్నికల కోసం వచ్చారనీ, తరువాత 11 నెలలూ ఢిల్లీలోనే ఉంటారనీ హేమరాజ్ అంటున్నారు.
ఆకట్టుకుంటున్న వరుణ్ గాంధీ
వరుణ్ గాంధీ నియోజకవర్గంలో విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ తన విజయావకాశాలను మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా ఆ గ్రామంలోని గ్రామస్తులను, పెద్దలను, ప్రముఖులను ప్రశంసిస్తూ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత గ్రామీణులను తమకే ఓటు వేయాలని సున్నితంగా కోరతారు. గ్రామంలో జరిగే సభలో కేవలం ఐదు నుంచి పది నిమిషాలు మాత్రమే క్లుప్తంగా మాట్లాడతారు. ఇలా ఆయన రోజూ 15 – 20 గ్రామాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తనని మూడు లక్షలకు తగ్గకుండా మెజారిటీతో గెలిపిస్తే అందరికీ ఉద్యోగ, ఉపాధి, వైద్యావకాశాలను కల్పిస్తానని అంటున్నారు.
బీజేపీ అధినాయకత్వంతో స్పర్థలు?
వరుణ్‌గాంధీకి బీజేపీ నాయకత్వంతో స్పర్థలు పొడచూపినట్టు వార్తలు వస్తున్నాయి. అమిత్ షా బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం వరుణ్ గాంధీని బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి 2014లో తొలగించారు. స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో కూడా వరుణ్ గాంధీ పేరుని చేర్చలేదు. వరుణ్ గాంధీ వివిధ అంశాలపై చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయనీ, అందుకే ఆయనను అమిత్‌షా దూరంగా ఉంచారనీ, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
2014 ఎన్నికల చిత్రం
గెలుపొందిన అభ్యర్థి మేనకా గాంధీ (బీజేపీ)
మెజారిటీ 3,07,052
ఓడిపోయిన అభ్యర్థి బుధ్‌సేన్ వర్మ (ఎస్పీ)
నియోజకవర్గంలో ఓటర్లు 10,50,342
లోక్‌సభలోని అసెంబ్లీ సెగ్మెంట్లు 4
Comments
Please login to add a commentAdd a comment