సాక్షి, కడప : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్రెషన్‌లో ఉన్నారని.. అందుకే మోదీపై తిరగబడాలంటూ మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. ఆదివారం ఉదయం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘ ఆయన(చంద్రబాబు) డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నారు. అందుకే తిరగబడాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఎన్నికల్లో సమయంలో 1200 వాగ్దానాలు చేశారు. కనీసం వాటిలో 10శాతం కూడా పూర్తి చేయలేదు. కానీ, బీజేపీ మాత్రం హామీల్లో సగం పూర్తి చేసింది. మిగతావి కూడా త్వరలోనే నెరవేరుస్తుంది. పోనీ అధికారంలో చంద్రబాబు రాష్ట్రానికి ఏమైనా చేశారా అంటే.. ఎంత సేపు డబ్బులు వెనకేసుకోవటంలోనే బిజీగా అయిపోయారు. స్కూల్ యూనిఫామ్ క్లాత్‌లను చెన్నై నుంచి తెచ్చి అప్కోలో కొన్నట్లు చెబుతూ మోసం చేస్తున్నారు. చంద్రబాబు పక్కా కాంగ్రెస్ కోవర్టు. ఇప్పటికీ లాలూచీ పడుతూనే ఉంటారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నారు’ అని వీర్రాజు విరుచుకుపడ్డారు.
ఇక రాయలసీమ జిల్లాలకు కేంద్రం చేసిన సాయం గురించి వివరించిన ఆయన.. పెండింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నట్లు తెలిపారు. రాయలసీమపై బీజేపీ కన్నబిడ్డపై చూపే ప్రేమను చూపుతుంటే.. బాబు మాత్రం సవతి ప్రేమను చూపిస్తున్నారన్నారు. సీమ ప్రజలకు ఇంత చేస్తే కేంద్ర ప్రభుత్వంపై తిరగబడాలంటూ ఎందుకు ప్రకటనలు చేస్తున్నారంటూ చంద్రబాబును నిలదీశారు. హంద్రినీవా అంచనాలను పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ ను అద్భుతంగా తీర్చి దిద్దినట్లు అసెంబ్లీలో ప్రకటించారని.. మళ్లీ ఇప్పుడు అదే అసెంబ్లీలో నిత్యం అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. సీఎం డ్యాష్ బోర్డ్ అనేది మొత్తం తప్పుల తడకేనన్నారు.
శివాజీ ఆరోపణలపై... ఇక సినీ నటుడు శివాజీ బీజేపీపై చేసిన ఆరోపణలపై సోము వీర్రాజు స్పందించారు. శివాజీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే పిలిపించి.. ఆ ఆధారాలపై దర్యాప్తు ప్రభుత్వం చేపట్టాలి. కానీ, నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారంటే అందులో అర్థం ఏంటని? ఆయన అన్నారు. దమ్ముంటే విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ఆయన సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment