
సాక్షి, చెన్నై : తన పుట్టినరోజు సందర్భంగా కొత్త పార్టీ ప్రారంభించే పనిలో తమిళ సీనియర్ హీరో కమల్ హాసన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతాడా? అన్న సందేహం సాధారణ ప్రజానీకంతోపాటు మీడియాను వేధిస్తోంది. అందుకే ఆయన కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అభిప్రాయాలను సేకరిస్తోంది.
ఈ క్రమంలో ఆయన సోదరుడు చారు హాసన్ తంతి ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమల్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చారు హాసన్ పేర్కొన్నారు. ‘కమల్ రాజకీయాల్లోకి రావటాన్ని స్వాగతిస్తున్నా. అయితే అతను రాజకీయాల్లో ఏ మేర విజయవంతం అవుతాడో చెప్పటం కష్టం. కమల్‌తో పోలిస్తే రజనీకాంత్‌కే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి’ అని చారుహాసన్ చెప్పారు. అయితే రజనీ రాజకీయాల్లోకి రాడనే భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
న్యాయ దిగ్గజం.. జాతీయ అవార్డు నటుడు అయిన చారుహాసన్ సోదరుడి ఎంట్రీపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ఉన్న నేతల్లో పీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రామదాస్ ముఖ్యమంత్రి అభ్యర్థికి అన్ని విధాల అర్హుడని చారు హాసన్ పేర్కొన్నారు.