ఎంపీ, ఎమ్మెల్యే సమక్షంలో ఘర్షణ పడుతున్న టీఆర్‌ఎస్ కార్యకర్తలు
కొణిజర్ల : ‘కారు’ హీటెక్కింది. టీఆర్‌ఎస్‌లో వర్గ పోరు మరోమారు బహిర్గతమైంది. వైరా నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న టీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల వర్గ పోరు బుధవారం ఒక్కసారిగా భగ్గుమన్నది. దీనికి.. పెద్దమునగాలలో రైతుబంధు చెక్కుల పంపిణీ సభ ‘వేదిక’గా మారింది. అసలేం జరిగిందంటే... బుధవారం, పెద్దమునగాలలో రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటైంది.
షెడ్యూల్‌లో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ వస్తున్నట్టుగా లేదు. కానీ, మొదట ఎమ్మెల్యే మదన్‌లాల్ వచ్చారు. సభలో పాల్గొన్నారు. ఐదు నిముషాల తరువాత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. ముందుగా ఎమ్మెల్యే, ఆ తరువాత ఎంపీ ప్రసంగించారు. పెద్దమునగాలకు చెందిన మహిళలతో నాగలిని ఎంపీకి బహుకరించేందుకు కార్యకర్తలు సిద్ధమయ్యారు. మహిళలు ముందుకు వస్తున్నారు. అప్పటికే ఎమ్మెల్యే ఆదేశాలతో, రైతుబంధు చెక్కుల పంపిణీకి లబ్ధిదారులను వేదిక వద్దకు అధికారులు అదే సమయంలో పిలిచారు. ఎంపీ వర్గీయుడైన వైరా మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోసూరి శ్రీను, నేరుగా వేదిక వద్దకు వచ్చారు.
మైక్ లాక్కున్నారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. దీనికి ఎమ్మెల్యే మదన్‌లాల్ అంగీకరించకుండా, మైకును కోనూరి శ్రీను నుంచి తీసుకునేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి శ్రీను కదల్లేదు. దీంతో, ఎమ్మెల్యే వర్గీయులు వచ్చి ఆయనను పక్కకు నెట్టేశారు. శ్రీనుకు మద్దతుగా ఎంపీ వర్గీయులు కూడా వచ్చారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరినొకరు తోసుకున్నారు. అరుపులు కేకలతో సభా ప్రాంగణం రణరంగాన్ని తలపించింది.
ఎంపీ, ఎమ్మెల్యే చూస్తుండగానే.. ఒకానొక దశలో కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. వైరా సీఐ మల్లయ్య స్వామి నేతృత్వంలో కొణిజర్ల, వైరా, తల్లాడ ఎస్‌ఐలు కలిసి పరిస్థితిని అదుపు చేశారు. అందరినీ బయటకు నెట్టేశారు. ఆ తరువాత, వేదిక పైనుంచి వాహనంలో బయటకు వెళుతున్న ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను ఎంపీ వర్గీయులు అడ్డుకున్నారు. అక్కడ మరోసారి రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది.
పరస్పరం నినాదాలు చేశారు. వారిని మరోసారి పోలీసులు చెదరగొట్టారు. చివరికి.. ఎమ్మెల్యే, ఎంపీ తమ తమ వాహనాలలో వెళ్లిపోయారు. ‘స్థానిక’ ఎన్నికలపై ప్రభావం ఉంటుందా..?! టీఆర్‌ఎస్‌కు చెందిన ఈ ఇద్దరు పెద్దల మధ్య దూరం, వారి వర్గీయుల మధ్య గొడవల ప్రభావం.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఉంటుందా..?! ఇది, ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment