
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంటరీ సెక్రటరీలుగా ఉన్నవారిపై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వేటు వేయాలని గవర్నర్‌కు తాము పిటిషన్ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి చెప్పారు. దీనిపై గవర్నర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 15శాతానికి మించి మంత్రులుగా ఉండటం రాజ్యాంగ విరుద్ధం అని, కానీ, సీఎం కేసీఆర్ మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలను పార్లమెంట్ సెక్రెటరీలుగా నియమించారని, ఈ విషయాన్ని హైకోర్టు ప్రశ్నించడంతో ఆరుగురుని పార్లమెంట్ సెక్రటరీలుగా తప్పించారు కానీ వేటు వేయలేదన్నారు. ఇలా చట్టం ఉల్లంఘన చేసిన ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యేలపై రాష్ట్రపతి వేటువేశారని, ఇప్పుడు తెలంగాణలో అదే ఉల్లంఘనకు పాల్పడిన ఎమ్మెల్యేలపై కూడా వేటు వేయాలనడి డిమాండ్ చేశారు.
తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని కేసీఆర్ అమలుచేస్తున్నారని విమర్శించారు. తాము ఇచ్చిన పిటిషన్‌లు గవర్నర్ రాష్ట్రపతికి పంపిస్తారని తాము నమ్ముతున్నామన్నారు. పార్లమెంటరీ సెక్రటరీలపై వేటుపడటంతో ఇప్పటి వరకు వారు తీసుకున్న జీతభత్యాలను తిరిగి వసూలు చేయాల్సిందేనని చెప్పారు. కేసీఆర్‌కు చట్టం, ప్రజలు, న్యాయస్థానాలంటే లెక్కేలేదని, త్వరలోనే మరోసారి రాష్ట్రపతి, సీఈసీలను కలిసి ఈ విషయం వివరిస్తామన్నారు. కేసీఆర్ దొరికిన దొంగ అని, టీఆర్‌ఎస్ తప్పుంది కాబట్టే గులాబీ కూలి, పార్లమెంటరీ సెక్రటరీలపై స్పందించడం లేదన్నారు. గులాబీ కూలీపై ప్రధాని ఆఫీస్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, ఈ విషయంలో తేలుకుట్టిన దొంగలుగా టీఆర్‌ఎస్ నేతలు సైలెంట్‌గా ఉన్నారని ఎద్దేవా చేశారు. గులాబీ కూలీ పేరుతో టీఆర్‌ఎస్ నేతలు రూ.కోట్ల దోపిడీ చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేసేదాకా గులాబీ కూలీపై పోరాడుతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment