సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎత్తుకుపై ఎత్తు వేస్తున్నారు. వారి మధ్య దాగుడుమూతలు కొనసా గుతున్నాయి. ఒకరేమో సస్పెన్షన్ కోరుకుంటుండగా, మరొకరేమో అనర్హత వేటు వేయాలని కాచుకొని ఉన్నారు. ఈ నెల 10న ఢిల్లీలో జరిగిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్ మరుసటిరోజే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంపై టీఆర్‌ఎస్ ఆరా తీస్తోంది. బీజేపీలో డీఎస్ చేరడం ఖాయమని భావిస్తున్న టీఆర్‌ఎస్.. తనతోపాటు ఎవరెవరిని వెంట తీసుకెళ్లే అవకాశం ఉందనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. తనంత తానుగా టీఆర్‌ఎస్‌ను వీడకుండా సస్పెండ్ చేసే వరకు పార్టీలో కొనసాగాలనే వ్యూహాన్ని డీఎస్ అమలు చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. సస్పెన్షన్ వేటుపడే పక్షంలో తన రాజ్యసభ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా ఉండదనే ఆలోచనలో డీఎస్ ఉన్నారు. పార్టీ మారకుండానే బీజేపీకి మద్దతు పలికే పక్షంలో ఎలాంటి వైఖరి అనుసరించాలనే అంశంపై కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు.
పార్టీ వైఖరి తెలుసుకునేందుకే..?
నిజామాబాద్ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కవితతో విభేదాలు తలెత్తడం, సీఎంకు ఫిర్యాదు చేయడం, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీఎంను డీఎస్ సవాల్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏడాదిన్నరగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న డీఎస్ పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అయితే, ఆ సమావేశానికి సంబంధించిన సమాచారం టీఆర్‌ఎస్ ఎంపీలకు చేరవేసే క్రమంలో డీఎస్‌కు కూడా యథాలాపంగా వెళ్లి ఉంటుందని పలువురు ఎంపీలు చెప్తున్నారు.డీఎస్ మాత్రం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తనపై టీఆర్‌ఎస్ వైఖరి ఎలా ఉందో అంచనా వేసుకునేందుకే ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. డీఎస్ కేవలం 20 నిమిషాలు మాత్రమే తమతో ఉన్నారని, టీ తాగడం మినహా పార్టీ వ్యవహారాలపై ఎలాంటి చర్చ జరపలేదని ఆ పార్టీ ఎంపీ ఒకరు వెల్లడించారు.
పార్టీని వీడే అవకాశమున్నవారిపై నజర్
ఓ వైపు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు చురుగ్గా సాగుతుండగా, మరోవైపు నోటిఫికేషన్ వెలువడే నాటికి డీఎస్‌సహా కొందరు టీఆర్‌ఎస్, కాం గ్రెస్ పార్టీల కీలకనేతలు తమ పార్టీలో చేరతారంటూ బీజేపీ విస్తృత ప్రచారం చేస్తోంది. బీజేపీ నేతలది ‘మైండ్‌గేమ్’గా అని టీఆర్‌ఎస్ అంటూనే, పార్టీని వీడే అవకాశమున్న నాయకులపై ఓ నజర్ వేసినట్లు సమాచారం. గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు ఎవరైనా డీఎస్, బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారా అనే కోణంలోనూ నిఘా పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీతోనూ డీఎస్ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో డీఎస్ చేరినట్లు వార్తలు వచ్చినా అధికారికంగా ఆయన చేరికను ధ్రువీకరించలేదు.
Comments
Please login to add a commentAdd a comment