
వడోదర : కేంద్ర మంత్రి మేనకా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మేనకా గాంధీ పూలమాల వేయడంతో ఆ ప్రాంతమంతా కలుషితమైందని కొంత మంది దళితులు విగ్రహాన్ని ప్రక్షాళన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా మేనకా గాంధీ శనివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఎంపీ రంజరన్ బెన్, ఇతర బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.
వీరంతా అక్కడకు చేరుకున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఠాకూర్ సోలంకి నేతృత్వంలోని దళితులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు... దళితుల మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. వారు తిరిగి వెళ్లిపోయిన తర్వాత దళిత సంఘం కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహాన్ని పాలు, నీటితో ప్రక్షాళన చేశారు. బీజేపీ నేతల రాక వల్ల ఆ ప్రాంతం కలుషితమైపోయిందని, అందుకే ప్రక్షాళన చేశామని సోలంకి వ్యాఖ్యానించారు.
బీజేపీ నాయకుల ఘెరావ్..
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించడానికి దళిత కార్యకర్తలు, బీజేపీ నాయకుల కంటే ముందే స్థానిక జీఈబీ సర్కిల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో దళిత కార్యకర్తలు బీజేపీ నాయకులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్కిల్ వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.