సబ్బండ వర్గాలకు 'పండగే'! | Damodar Raja Narasimha Interview | Sakshi
Sakshi News home page

సబ్బండ వర్గాలకు 'పండగే'!

Published Thu, Nov 15 2018 3:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Damodar Raja Narasimha Interview - Sakshi

‘‘నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొలి నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనంతా మోసపూరిత మాటలు, దగాకోరు వాగ్దానాలతో సాగింది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీనీ కేసీఆర్‌ నిలబెట్టుకోలేదు. హామీల పేరుతో ప్రజలను నిలువునా వంచించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఒక్కరినీ పరామర్శించే తీరిక కేసీఆర్‌కు లేకపోయింది. ఇలాంటి పోకడ అప్పుడు నిజాంకు ఉంటే, అదే వైఖరిని కేసీఆర్‌ పుణికి పుచ్చుకున్నారు. మేం కేసీఆర్‌లా ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. ఏకకాలంలో రుణమాఫీ, లక్ష ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చాం. సబ్బండ వర్గాలకు సమ్మతమయ్యేలా, వారి అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించేలా మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతాం’’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ చెప్పారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

ప్రజల ఆకాంక్షలు తెలిశాయి..
కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ప్రజల ఆకాంక్షలేమిటి? ప్రభుత్వాల నుంచి ఏం ఆశిస్తున్నారో ప్రజల నుంచే ప్రత్యక్షంగా తెలుసుకున్నా. 600కు పైగా విజ్ఞప్తులు స్వీకరించాను. పది వేల మందితో మాట్లాడా. సబ్‌ కమిటీ సభ్యులు వివిధ అంశాలపై అన్ని వర్గాల నుంచి జిల్లాలన్నీ తిరిగి వినతులు స్వీకరించారు. అందరి ఆకాంక్షలకు తగ్గ ప్రజా మేనిఫెస్టో తయారు చేశాం. 

రైతుల కోసం ఎంతైనా చేస్తాం..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యం కావడంతో 3,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క కుటుంబాన్నీ కేసీఆర్‌ పరామర్శించలేదు. మేం రూ.2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేస్తాం. ఈ విషయంలో కేసీఆర్‌లా రైతులను మోసం చేయం. కౌలు రైతులకూ రైతుబంధును వర్తింపజేస్తాం. 17 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. వరి, మొక్కజొన్నకి క్వింటాల్‌కు రూ.2 వేలు, పత్తికి రూ.7 వేలు, మిర్చి, పసుపుకు రూ.10 వేలు ఇచ్చేలా మేనిఫెస్టోలో చేరుస్తున్నాం. ఏకకాల రుణమాఫీ అసాధ్యమేమీ కాదు. దీనిపై ఆర్థిక నిపుణులతోనూ చర్చించాం. వెల్‌నెస్‌ కేంద్రాలను పెంచి ఉద్యోగులు, జర్నలిస్టులకూ ఉచిత వైద్యం కల్పిస్తాం. సర్కార్‌ బడులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దుతాం. రూ.1.74 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,500 కోట్లు చెల్లించడానికి ఈ ప్రభుత్వానికి మనసు రాలేదు. మేం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తాం. బడ్జెట్‌లో 20 శాతం విద్యారంగానికే కేటాయిస్తాం. 

కేసీఆర్‌లా మోసం చేయం
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ నియమాకాల్లో నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది. ఓ పక్క నోటిఫికేషన్లు ఇచ్చి, మరోపక్క కోర్టుల్లో కేసులు వేయించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడింది. హోంగార్డు పోస్టులను భర్తీ చేసి వాటిని ప్రభుత్వోద్యోగాలుగా చూపారు. ఇలా ప్రజలు, నిరుద్యోగులను మోసం చేసే వైఖరి కాంగ్రెస్‌కు లేదు. ఒక్క టీచర్‌ పోస్టునూ భర్తీ చేయకుండా దిగిపోయిన ప్రభుత్వం చరిత్రలో ఏదైనా ఉందంటే అది కేసీఆర్‌ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తాం. రాష్ట్రంలో 2.80 కోట్ల బీపీఎల్‌ కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఇప్పటికే 7 కిలోల సన్నబియ్యం, ఏటా 6 ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పాం. ఇందులోనూ ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా రేషన్‌ అందిస్తాం. 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. కాంగ్రెస్‌ హయాంలో మహిళా సంఘాలు బలంగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. వీటికి పునర్వై భవం తెచ్చి.. రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఒక్కో మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంటు, 58 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్లు, అభయహస్తం, జనశ్రీ యోజన, ఆమ్‌ఆద్మీ యోజన పునప్రారంభం వంటి కార్యక్రమాలు చేపడతాం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం..
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. దీంతో ఏటా రూ.14 వేల కోట్ల మేర నిధులు మురిగిపోయాయి. ఎస్సీ వర్గీకరణపై  ప్రభుత్వం మాట తప్పింది. మేం చేసి చూపిస్తాం. ఎస్సీల్లో మాదిగ, మాల, ఇతర ఉపకులాలకు వేర్వేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, వారి సంక్షేమానికి నిధులు వెచ్చిస్తాం. ఎస్సీల్లో లంబాడాలకు ఒకటి, కోయ, గోండులను కలిపి ఇంకొకటి, ఇతర తెగలకు కలిపి మరొక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. బీసీలకూ ఇదే మాదిరి చేస్తాం. వీరికి ప్రత్యేకంగా సబ్‌ప్లాన్‌ అమలు చేస్తాం. నిమ్న వర్గాలను ఇందిరమ్మ ఇళ్ల విషయంలో దగా చేశారు. వారి ఇళ్ల నిర్మాణాలకు చేయూతనిస్తాం. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల సాయం.. పాత బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. సమ్మక్క–సారక్క జాతరను జాతీయ పండగగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.

భూములు గుంజుకుంటే ఊరుకోం..
అవసరం లేనిచోట సైతం పెద్దపెద్ద రిజర్వాయర్లు నిర్మించి ప్రజలను నిర్వాసితులను చేస్తామంటే కాంగ్రెస్‌ ఊరుకోదు. నిజంగా అవసరమైతే.. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి వారిని గౌరవంగా చూసుకోవాలి. భయపెట్టి, బాధపెట్టి, వాతలు పెట్టి భూములు గుంజుకుంటామంటే చూస్తూ ఊరుకోం. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుండా లాక్కుంటే కోర్టులున్నాయి. అక్కడే తేల్చుకుంటాం. 

ఇన్నాళ్లూ కేసీఆర్‌ మూడెకరాలు, ఇళ్లనీ, ఉద్యోగాలనీ ప్రజలను మోసం చేశారు. మేం మాత్రం చెప్పింది చేసి చూపిస్తాం. మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. మీడియా, సామాజిక మాధ్యమాలు, కరపత్రాల ద్వారా ప్రజలకు కొంత చేరువ చేశాం. మా అధినేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీతోనూ చెప్పిస్తాం. మేనిఫెస్టో అంశాలతోనే టీఆర్‌ఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేస్తాం.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ.3 వేలు అని ప్రకటించగానే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. అందుకే హడావుడిగా పాక్షిక మేనిఫెస్టో అని కొత్త నాటకాన్ని తెరపైకి తెచ్చి నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని ప్రకటించారు. నిజంగా భృతి ఇవ్వాలని ఉంటే, నాలుగేళ్లుగా ఎందుకు ఇవ్వలేదని మేం ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం లేదు.

డీఎస్సీ విషయంలో మేం క్లియర్‌. తొలి ఏడాదిలోనే ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. దీనిద్వారా 20వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. తొలి సంతకం దీనిపైనే ఉంటుందన్న మాటకు కట్టుబడి ఉంటాం.

ఏటా యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. దాని ఆధారంగానే నోటిఫికేçషన్లు ఇచ్చి, నిర్ణీత కాలపరిమితితో ఉద్యోగ నియమాకాలు చేపడతాం. ఖాళీ అయిన ప్రతి పోస్టునూ భర్తీ చేస్తాం. అనేక మంది యువతీ యువకులు పెళ్లిళ్లు కూడా చేసుకోకుండా డీఎస్సీకి సిద్ధమవుతున్నారు. వారిని కేసీఆర్‌లా మేం మోసం చేయం. కోర్టుల్లో కేసులు వేయం. రూ.2 లక్షల కోట్లుదాటే బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి పెద్ద భారం కాదు.

సాగునీటి ప్రాజెక్టులకు మేం అడ్డుకాదు. వాటిపేరు చెప్పి అంచనాలు పెంచుతాం, నిర్వాసితులను రోడ్డునపడేస్తాం, ఇష్టారీతిన దోచుకుంటామంటేనే వ్యతిరేకిస్తాం. మా హయాంలోనే 33 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి 2014 నాటికే 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చాం. మేం చేపట్టిన ప్రాజెక్టుల కిందే ఈ నాలుగున్నరేళ్లలో మరో 8 లక్షల ఎకరాలకు ఆయకట్టు సాగులోకి వచ్చినా, అది తన ఘనతగా టీఆర్‌ఎస్‌ చెప్పుకుంటోంది. అదే నిజమైతే రెండేళ్లలో పూర్తి చేస్తామన్న పాలమూరు–రంగారెడ్డి ఏమైంది? జూన్‌లోనే నీళ్లిస్తామన్న కాళేశ్వరం ఏమైంది?.

వైద్యానికి సంబంధించి వైఎస్‌ ప్రభుత్వ హయాంలోనే కీలక సంస్కరణలు తెచ్చాం. ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలను ఆదుకున్నాం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియోజకవర్గానికో వంద పడకలు, మండలానికో 50 పడకల ఆస్పత్రంటూ చెప్పి మోసం చేసింది. కానీ మేం అధికారంలోకి రాగానే నియోజకవర్గానికో వంద పడకల ఆస్పత్రి, మండలానికో 20–30 పడకల ఆస్పత్రి నిర్మించి తీరుతాం. రాజధానిలో వెయ్యి పడకలతో మెడికల్‌ కాలేజీని నిర్మిస్తాం. ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని వ్యాధులనూ తీసుకొస్తాం.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement