‘పుట్ట’లోంచి బయటపడుతున్న కట్టల పాములు! | election seized huge amounts | Sakshi
Sakshi News home page

‘పుట్ట’లోంచి బయటపడుతున్న కట్టల పాములు!

Published Tue, Nov 27 2018 5:43 AM | Last Updated on Tue, Nov 27 2018 8:55 AM

election seized huge amounts - Sakshi

ఆపరేషన్‌ వన్‌ వీక్‌... డిసెంబర్‌ 1నుంచి ఎన్నికలు జరిగే 7వ తేదీవరకు ఆపరేషన్‌ వన్‌వీక్‌ పేరుతో ఎన్నికల స్క్వాడ్స్, పోలీస్‌ బృందాలు, రెవెన్యూ పరిశీలకులు, పోలీస్‌ పరిశీలకులు ప్రత్యేక నిఘా పెట్టబోతున్నారు. అభ్యర్థుల అనుచరులు, వారి కదలికలను పసిగట్టి ఎక్కడికక్కడ దాడులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలు స్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే ఎనిమిది ప్రధాన మార్గాల్లో 18 చెక్‌ పోస్టులు ఏర్పాటుచేశారు.

ఇప్పుడు మరో 8 చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు తెలిసింది. అదే విధంగా జిల్లాల సరిహద్దుల్లో 58కి పైగా చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. అయితే ఇప్పుడు జిల్లాలు, ప్రధాన అర్బన్‌ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాల్లోకి వెళ్లే రూట్లలో ఒక్కో మార్గానికి 5 నుంచి 6 చెక్‌పోస్టులు ఏర్పాటుచేసేందుకు పోలీస్‌ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒక చెక్‌పోస్టు నుంచి తప్పించుకున్నప్పటికీ మరో చెక్‌పోస్టులో దొరికిపోయే అవకాశం ఉంటుందన్న పరిశీలకుల నివేదికతో ఎన్నికల కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న మద్యం, నగదు చూసి ఎన్నికల సంఘం షాక్‌ తింటోంది. నోటిఫికేషన్‌ వచ్చిన దగ్గరినుంచి ఇప్పటివరకు దాదాపుగా రూ.100 కోట్ల విలువైన మద్యం, నగదు, ఇతర వస్తువులను ఎన్నికల, పోలీస్‌ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ఉధృతం చేస్తుండటం, ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రలోభాలు తీవ్రతరం కాబోతున్నాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్‌ శాఖ, రెవెన్యూ, ఎక్సైజ్‌ ప్రత్యేక బృందాలు చివరి వారంరోజుల్లో మరిన్ని దాడులు, సోదాలు నిర్వహించబోతున్నాయి. ఇన్నాళ్లు జరిగింది ఒక ఎత్తు, ఈ వారంరోజులు జరగబోయే తంతు మరో ఎత్తుగా ప్రత్యేక బృందాలు భావిస్తున్నాయి.
బంగారం, వెండి, గంజాయి..
టికెట్ల కేటాయింపు దగ్గరి నుంచి ప్రచారం ముగిసే ఆఖరిరోజు వరకు కార్యకర్తలు, నేతలతోపాటు ఓటర్లను ప్రలోభానికి గురిచేసేందుకు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో నగదు, మద్యం, ఇతర కానుకలను ఇచ్చి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికలకు సరిగ్గా వారం రోజులముందు అంటే డిసెంబర్‌ 1నుంచి ఎన్నికల ప్రక్రియ జరిగే వరకు కీలకమైన రోజులను పార్టీలు, అభ్యర్థులు పెద్దఎత్తున ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తాయి.

ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువైన నగదు, మద్యం, బంగారం స్వాధీనమవడమే ప్రలోభాల స్థాయికి పెద్ద ఉదాహరణ అని పోలీస్‌ శాఖ భావిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో పోలీస్‌ శాఖ తనిఖీల్లో రూ.62.18 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. అదేవిధంగా ఐటీ విభాగం రూ.21.22 కోట్లను స్వాధీనపర్చుకుంది. అంటే, మొత్తం నగదు రూ.83 కోట్లుగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక అందించారు. ఇక పోలీస్‌ శాఖ తనిఖీల్లో రూ.87లక్షల విలువైన 24,087 లీటర్ల మద్యం పట్టుబడింది.

ఎక్సైజ్‌ నేతృత్వంలో దాడులు నిర్వహించగా రూ.9.20 కోట్ల విలువైన 41వేల లీటర్ల మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. మొత్తంగా రూ.10 కోట్లకు పైగా విలువైన మద్యం ఎన్నికల నేపథ్యంలో స్వాధీనపరుచుకున్నారు. పోలీస్‌ శాఖ జరుపుతున్న తనిఖీల్లో భాగంగా బంగారం, వెండి, గుట్కా ప్యాకెట్లు, గంజాయి తదితరాలు సైతం పట్టుబడ్డాయి. ఇలా రూ.7.50 కోట్ల విలువైన బంగారం, వెండి, గుట్కా అక్రమ మార్గంలో రాష్ట్రానికి చేరినట్టు పోలీస్‌ శాఖ నివేదించింది. మొత్తంగా రూ.100 కోట్ల మేర నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడటం ఎన్నికల కమిషన్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

జహీరాబాద్‌లో రూ. 50 లక్షలు పట్టివేత
జహీరాబాద్‌ టౌన్‌: కారులో తరలిస్తున్న రూ. 50 లక్షలను జహీరాబాద్‌ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్థానిక డీఎస్పీ నల్లమల రవి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దులోని చిరాగ్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని మాడ్గి చౌరస్తాలో జాతీయ రహదారిపై వాహనాలను తని ఖీలు చేస్తుండగా బొలేరో వాహనంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన అబ్దుల్‌ సత్తార్‌ వద్ద రూ.50 లక్షలు లభించాయన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్‌ చేసి ఎన్నికల సెల్‌కు సమాచారం అందించామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement