సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్ తెలిపారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాతబస్తీ అభివృద్ధి ఎంఐఎంకు పట్టదని విమర్శించారు. వాళ్లకు కావాల్సిందల్లా భూకబ్జాల్లో పోలీసుల సహకారం అని మండిపడ్డారు. ఎంఐఎం విషయంలో తమ పార్టీ తప్పుచేసిందని అంగీకరిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు కానుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మూడు ఒకటే అని ఆరోపించారు. ఢిల్లీలో ఆ మూడు పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకుడని.. కానీ తెలంగాణలో మాత్రం తాము వేర్వేరు అన్నట్టు పోటీ చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను, జాతులను, ధర్మాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీ కోసమే పనిచేసిందని అన్నారు. కేసీఆర్ బీజేపీ గెలుపు కోసం, బీజేపీ కేసీఆర్ గెలుపు కోసం కష్టపడుతున్నాయని ఆయన ఆరోపించారు. కూటమిలో ఉన్న అందరు కలిసి కట్టుగా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ కలిసి మీటింగ్ కూడా పెట్టారని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ ఇద్దరు కవల పిల్లలేనంటూ ఆరోపించారు. బేటీ బచావో.. బేటీ పడావో అన్నారు.. కానీ మహిళలు, ఆడపిల్లల మీద అత్యాచారాలు గతంలో కంటే ఇప్పుడే పెరిగాయని పేర్కొన్నారు. కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా.. వారికి మూడెకరాల భూమి ఇస్తా.. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తానన్నారు.. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. కేసీఆర్ విద్యా వ్యతిరేకి.. ఫీజ్ రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండ పని చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment