
బిందువు బిందువు సింధువు అయినట్లు.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభంజనంగా మారి రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఊళ్లకు ఊళ్లే పాదయాత్ర ప్రాంతానికి తరలి వస్తుండటం, చిన్నారులు మొదలు వయో వృద్ధుల వరకు వైఎస్ జగన్‌ను కలవాలని, కరచాలనం చేయాలని పోటీపడ్డారు. ఈ ఆదరణ చూసి సర్కారు పెద్దలకు కన్ను కుట్టింది. ఎన్నెన్నో కుయుక్తులు చేశారు. జనం రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఏవీ సఫలం కాకపోవడంతో ఏకంగా అంతమొందించడానికి వ్యూహం పన్నారు. ఇదీ బెడిసి కొట్టడంతో నోటì కి పని చెప్పారు. వీటన్నింటినీ అధిగమించిన జగన్ కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర చరిత్రను తిరగరాసిన ఘన చరిత్ర.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర. ఇక 2014 తర్వాత విభజనాంధ్రప్రదేశ్‌ను అవినీతి, అక్రమాలు, అరాచకాలతో అవశేషాంధ్రగా మార్చేస్తున్న దారుణ పరిస్థితుల్లో తల్లడిల్లిన ప్రజల గుండెచప్పుడై.. రాష్ట్ర దిశ, దశ మార్చాలన్న సంకల్పంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రది మరో చరిత్ర. నాడు మహానేత వైఎస్ పాదయాత్ర కళ్ల ముందు మెదిలి.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ చేపట్టే పాదయాత్ర ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకున్న టీడీపీ పెద్దల కళ్లు బైర్లు కమ్మాయి. అంతే.. అసలు జగన్‌ను జనంలోకి వెళ్లకుండా చేయాలని కుయుక్తులు పన్నారు.. కుట్రలకు దిగారు. కానీ ఏ క్షణంలోనూ వైఎస్ జగన్ చలించలేదు. అందుకే ఎక్కడికక్కడ పాదయాత్రలో జనం సముద్రంలా పోటెత్తారు. జనతరంగం ప్రతిచోటా ఉవ్వెత్తున ఎగిసింది.
సరైన భద్రత కల్పించకుండా..
ఇక పాదయాత్రలో ప్రతిపక్ష నేత స్థాయికి కల్పించాల్సిన సరైన భద్రతను ఇవ్వలేదు. స్వచ్ఛందంగా వెల్లువెత్తుతున్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పాదయాత్ర దృశ్యాలు, వైఎస్ జగన్ ప్రసంగాలు టీవీల్లో కనపడకుండా, వినపడకుండా సరిగ్గా యాత్ర జరిగే ఊళ్లలో అప్రకటిత కరెంటు కోతలు విధించారు. కుట్రలు, కుతంత్రాలు, ఆంక్షలు, అవాంతరాలను తుత్తునియలు చేస్తూ అన్నింటినీ చిరునవ్వుతో అధిగమించి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగారు. ఇడుపులపాయలో జనజాతరలా మొదలై.. రాయలసీమ జిల్లాలను దాటి... కోస్తాంధ్ర జిల్లాల్లోకి అడుగుపెట్టేసరికి సంకల్పయాత్ర జన ఉప్పెనలా మారిపోయింది. జిల్లా.. జిల్లా దాటుతూ ఉంటే యాత్ర మహోజ్వల రూపం దాల్చుతూ వచ్చింది. పాదయాత్రతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జనంలోనే ఉంటూ రాజకీయం మొత్తం తన చుట్టూ తిరిగేలా చేశారు. అత్యంత ప్రభావవంతమైన, శక్తిమంతమైన నాయకుడిగా ఆవిర్భవించడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం ఆయనను అంతమొందించే కుట్రకు తెరతీసింది.
గుంటూరు జిల్లాలో ముందుగా రెక్కీలు
పాదయాత్రతో రోజురోజుకీ తమ కంట్లో నలుసులా మారిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను అంతమొందించడానికి కుట్ర చేశారు. ఈ క్రమంలో ముందు గుంటూరు జిల్లాలో.. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో రెక్కీలు కూడా నిర్వహించారు. ఏకంగా కేంద్ర రక్షణశాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలో చంపడానికి భారీ కుట్ర పన్నారు. అక్కడేం జరిగినా కేంద్రం మీదకు నెట్టేయాలని ప్లాన్ చేశారు. ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం థానేలంకకు చెందిన జె.శ్రీనివాసరావును పాత్రధారిగా ఎంచుకున్నారు. నేర చరిత్ర ఉన్న అతడికి ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ నేత, సీఎం చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్‌లో ‘పని’ కల్పించారు. సదరు శ్రీనివాసరావు ఆ రెస్టారెంట్‌లోనే కత్తులను భద్రపరుచుకుని హత్యాయత్నం చేసిన రోజు ఉదయం వాటికి పదును కూడా పెట్టాడు. ఇక ఎయిర్‌పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో)ను కూడా తమ వలలో వేసుకున్నారు.
పదేళ్లుగా రెస్టారెంట్ పేరుతో అక్కడే పాతుకుపోయిన హర్షవర్ధన్ చౌదరి.. చంద్రబాబు, లోకేష్‌ల పేర్లు చెప్పి విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను, యంత్రాంగాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారిపోయాడు. అందుకే సరిగ్గా వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చే నాటికి ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి. అక్టోబర్ 25న వైఎస్ జగన్‌కు రెస్టారెంట్ నుంచి కాఫీ తెచ్చే పేరిట శ్రీనివాసరావు చొరబడి కత్తి దూసి హత్యాయత్నానికి తెగబడ్డాడు. అయితే ప్రజల ఆశీస్సులు బలంగా ఉన్న ప్రతిపక్ష నేత తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డీజీపీతో సహా మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమాని అని, ఏదో ప్రచారం కోసం దాడి చేశాడని చాలా తేలిగ్గా తీసిపారేశారు. కుట్రధారులను తప్పించి కేసును పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) కేసు విచారణ చేపట్టాక విశాఖ పోలీసులు అడుగడుగునా సహాయ నిరాకరణ చేస్తుండటం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకేనని అర్థం చేసుకోవచ్చు. ఇవేవీ జగన్‌కు ప్రజాదరణను అడ్డుకోలేకపోయాయి.
అతనంటే ఒక నమ్మకం..
సార్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చి ఏడాదిన్నర దాటింది. ఫీజు కడితే తప్ప పరీక్ష రాయనీయబోమని అంటున్నారు. రీయింబర్స్‌మెంట్ వస్తుందని నమ్మి కళాశాలల్లో చేరితే ఇప్పుడు మా మెడపై కత్తి పెట్టి డబ్బు కడతారా? చస్తారా? అంటున్నారు. మీరే ఏదైనా చేసి ఆదుకోండి సార్. ఇలా ఒకటా.. రెండా.. లక్షలు.. ఏమిటివీ అనుకుంటున్నారా? ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బాధితులు చెప్పుకున్న సమస్యలు. నాలుగున్నరేళ్లుగా సమస్యలతో అల్లాడుతున్న ప్రజలకు వైఎస్ జగన్
ఒకే ఒక్క ఆశాకిరణంగా కనిపించారు.
ఊరవతల నీరింకిన చెరువులు, దారిపక్క చెట్టు కింద తడారిన గొంతుకలు, ఎండిన డొక్కలు, ముగ్గుబుట్ట వంటి తలలు, అన్నార్తులు, అభాగ్యులు, ఎటుచూసినా బతుకు బండి సాగని దైన్యం.. ఆదుకునే నాథుడే లేడు. అయినవాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు మూకుళ్లలో.. మీరు మా వాళ్లు కాదంటూ పాలక పార్టీ వాళ్ల తిరస్కరణ.. గుండె లోతుల్లో మెలిపెడుతున్న వ్యథ.. వీటినన్నింటినీ ఎవరికో ఒకరికి చెబితే గానీ ఊరట లభించదు. అదిగో.. అలాంటి తాడిత, పీడితులకు వేగుచుక్క.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి 2017, నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాలను చుట్టివచ్చారు. కోట్లాది మంది ప్రజలకు భరోసా కల్పించారు. అనేక సమస్యలతో కష్టాల్లో ఉన్న ప్రజలు తమ బాగోగులు తెలుసుకోవడానికి తమ వద్దకే వచ్చిన రాజన్న బిడ్డను చూసి ఉద్వేగభరితులయ్యారు.. ఆయనకు తమ ఈతి బాధలు చెప్పుకున్నారు.. తమ ఇక్కట్లను ఆయన దృష్టికి తెచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో అప్పటికప్పుడు చేయదగిన వాటిని ప్రతిపక్ష నేత అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన వాటిని ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చేలా లేఖలు రాశారు. విధానపరమైన వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపేలా ఏర్పాటు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తన సహాయం కోరివచ్చినవారికి కాదనకుండా ఆర్థిక, హార్థిక సహకారం అందించారు. మాటలు రాని పిల్లలకు కాక్లియర్ ఆపరేషన్లు చేయించి మాటలు తెప్పించారు. బ్రెయిన్ సర్జరీ అవసరమైనవారికి మార్గం చూపించారు.
ప్రతి ఫిర్యాదు నమోదు
ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలు తనకు చెప్పుకున్న ప్రతి సమస్యను, ఫిర్యాదును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన వ్యక్తిగత సహాయకుల ద్వారా కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయించారు. మొత్తం 340 రోజుల పాదయాత్రలో ఆయనకు కొన్ని లక్షల వినతులు, ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందాయి. వీటిని ఏ రోజుకా రోజు రికార్డు చేయించారు. అంతేకాకుండా వాటిని సమస్యల వారీగా వర్గీకరించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం పంటలకు గిట్టుబాటు ధరలు, రుణమాఫీ, విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగాల కల్పన, భూ సమస్యలు– వివాదాలు, భూ కబ్జాలు, జన్మభూమి కమిటీల ఆగడాలు తదితరాలు ఉన్నాయి. వీటిల్లో తక్షణమే పరిష్కరించాల్సిన వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని రికార్డు చేసి తమ ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
ఉలిక్కిపడ్డ ప్రభుత్వం
అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అన్యాయం, మోసానికి మారుపేరుగా మారి మొద్దుబారిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఉలిక్కిపడేలా చేసింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలతో జనం తమపై ఎక్కడ తిరగబడతారోనని భయపడి సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందు తూతూమంత్రంగా కొన్ని చర్యలు చేపట్టింది.
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment