చంఢీగడ్ : జలియన్ వాలాబాగ్ మారణహోమానికి నేటికి సరిగ్గా వందేళ్లు. బ్రిటీష్ - ఇండియా చరిత్రలో ఈ మారణహోమం ఓ మచ్చగా మిగిలిపోతుందని రెండు రోజుల క్రితం బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థెరిసా వ్యాఖ్యలు ప్రస్తుతం భారత రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి పాల్పడినందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పంబాజ్ సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్.. ‘అమరీందర్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురాగతానికి గాను బ్రిటన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని కోరడం బాగానే ఉంది. మరి మీ పార్టీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ సంగతేంటి. దానికి గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పాల్సిన పని లేదా’ అని ప్రశ్నించారు. అంతేకాక మీరు స్వయంగా దగ్గరుండి రాహుల్ గాంధీని సిక్కుల పవిత్రంగా భావించే శ్రీ అకాళి తక్త్ సాహిబ్‌లోకి తీసుకెళ్లారు.. మరి దీనికేం సమధానం చెప్తారంటూ హర్సిమ్రత్ కౌర్ వరుస ట్వీట్లు చేశారు.
1984లోఅమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న సిక్కు ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ.. హర్సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు. అంతేకాక స్వర్ణ దేవాలయంలోకి ఆయుధాలను, ట్యాంక్‌లను తీసుకువచ్చిన గాంధీ కుటుంబాన్ని ప్రశ్నించే ధైర్యం అమరీందర్‌కు లేదని ఆమె ఎద్దేవా చేశారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన అమరేందర్.. ‘మీరు, మీ భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్, ఆయన తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మీ ముత్తాత సర్దార్ సుందర్ సింగ్ మజిథియి జలియాన్ వాలాబాగ్ మారణకాండ అనంతరం జనరల్ డయ్యర్‌కు బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు. దాంతో ఆయన ప్రభు భక్తికి మెచ్చి బ్రిటన్ ప్రభుత్వం అతన్ని నైట్‌హుడ్ బిరుదతో సత్కరించడం గుర్తులేదా’ అని రీట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ట్వీట్ల యుద్ధం ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment