
దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కొందరు యశ్వంత్ సిన్హాకు మద్దతు నిలుస్తుండగా.. మరికొందరు ఏం మాట్లాడితే ఏమై పోతాదో అని భయపడిపోతున్నారు. తాజాగా యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వానికి శివసేన గట్టి సవాలే విసిరింది. ఒకవేళ యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు తప్పయితే, ధైర్యముంటే వాటిని నిరూపించుకోవాల్సిందిగా సవాల్ చేసింది. యశ్వంత్ సిన్హాపై కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటల్ బిహార్ వాజపేయి నేతృత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన సిన్హా, ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమవుతోందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన రాసిన వ్యాసం ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో 'ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ' పేరుతో ప్రచురితమైంది.
ఇటీవల శివసేన కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ సామ్నలో ఓ వ్యాసం రాసింది. ఈవీఎం మిషన్లను టాంపరింగ్ చేసి, ధన ప్రవాహాంతో ఎన్నికల్లో గెలువచ్చని కొందరు అనుకుంటున్నారని, కానీ ఆర్థిక వ్యవస్థ అధ్వానమైన పరిస్థితిని తెలుసుకోలేకపోతున్నారని విరుచుకుపడింది. సీనియర్ బీజేపీ నాయకులెందరో ఆర్థిక వ్యవస్థ విఫలమయ్యే స్థితిపై తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని, కానీ తెలియని ప్రమాదాలకు భయపడి చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించింది. ఒకవేళ యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలు తప్పయితే నిరూపించండి అని సవాలు విసిరింది. సిన్హా తప్పని బీజేపీ నిరూపించలేదని, ఎందుకంటే ఆయన సీనియర్ నేతని పేర్కొంది. చాలా పథకాలు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతున్నాయని, వీటిని విజయవంతం చేయడానికి ప్రభుత్వం కోట్ల కొద్దీ రూపాయలను వెచ్చిస్తున్నట్టు శివసేన విమర్శించింది.