ఆదివారం యల్లనూరులో జేసీ బ్రదర్స్ పంపిణీ చేసిన నాసిరకం చీర
మిగిలింది మూడు నెలలు. ఇప్పటి వరకు ఓటర్ల బాగోగులు పట్టించుకోని నేతలకు ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చింది. ఎన్నికలు వచ్చేసరికి.. ఎలాగైనా ఓట్లు రాబట్టుకునే క్రమంలో అధినేత చంద్రబాబును అనుకరిస్తూ ప్రలోభాలకు తెరతీశారు. అవినీతి ఆరోపణలు.. వర్గ విభేదాలు.. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చీరలు.. శాలువాలు.. హాట్‌బాక్స్‌ల పంపిణీతో ఓటర్లకు వల వేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లు తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జేసీ బ్రదర్స్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇన్నాళ్లు వెంట నడిచిన ద్వితీయ శ్రేణి ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా జారిపోతుండటంతో నియోజకవర్గంలో క్రమంగా పట్టు కోల్పోతున్నారు. వరుస పరిణామాలు ఓటమి దిశగా తీసుకెళ్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియమించిన తర్వాత పార్టీ బలోపేతమైంది. ఇక వచ్చే ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు తప్పవనే నిర్ధారణతో ఓటర్లను ఎలాగైనా బుట్టలో వేసుకోవాలనే దిగజారుడు రాజకీయాలకు జేసీ బ్రదర్స్ తెర తీశారు. జేసీ సోదరులు, వారి పిల్లలు ఎదగడం మినహా.. వాళ్ల వెంట నడిస్తే ఒరిగేదేమీ లేదని తెలుసుకున్న పార్టీ శ్రేణుల్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ సోదరులు నాయకులను వదిలేసి.. ఓటర్లకు ఓల వేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే చీరలు.. శాలువాలు.. హాట్‌బాక్స్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, యాడికితో పాటు తాడిపత్రిలో చీరలు పంపిణీ చేశారు. సూరత్ నుంచి నాసిరకమైన చీరలు తెప్పించి ఓటర్ల చేతుల్లో పెడుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పంపిణీ కష్టంగా ఉంటుందని గ్రహించి, జేసీ ప్రభాకర్‌రెడ్డి, తనయుడు అస్మిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ‘స్పర్శ’ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు. సూరత్ నుంచి లారీలతో తెప్పించినా చాలాచోట్ల చీరలు తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపని పరిస్థితి. కేవలం ఎన్నికల కోసం వీరు ఇదంతా చేస్తున్నారని, చీరలకు కక్కుర్తి పడేవారు లేరని మహిళలు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. పింఛన్ల పంపిణీ సమయంలో శాలువాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి హాట్‌బాక్స్‌లు ఇచ్చారు. ఇలా ధనబలంతో ప్రతి వర్గాన్నీ ప్రలోభాలకు గురి చేస్తున్నారు.
డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో మరో ప్రలోభం: రాయదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ నెల 21 నుంచి ‘డ్రైవింగ్ లైసెన్స్ మేళా’ నిర్వహిస్తున్నారు. 27వరకూ కొనసాగుతుంది. లైసెన్స్‌ల జారీ అనేది ఆర్టీఓ కార్యాలయాల్లో నిత్యం నడిచే తంతు! అయితే లైసెన్స్‌లు తాము ఇప్పించి ప్రజలకు మేలు చేస్తున్నామనే భావనతో అధికారులను రప్పించి, మీసేవ సెంటర్ ఏర్పాటు చేసి మంత్రి ఫొటోతో బ్యానర్ ఏర్పాటు చేసి కార్యక్రమం నడిపిస్తున్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు రూ.310, ఫోర్‌వీలర్‌కు రూ.460 చొప్పున లైసెన్స్ కావాల్సిన వాళ్లు చెల్లిస్తున్నారు. పోనీ ఇదైనా ప్రజాప్రతినిధి చెల్లించి ఉచితంగా లైసెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అదీ లేదు. ఎవరిడబ్బులు వారు చెల్లించి లైసెన్స్ తీసుకునే కార్యక్రమాన్ని కూడా వారి ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి తనయుడు మారుతి ఏకంగా టీడీపీ కార్యాలయంలో మేళాను ఏర్పాటు చేశారు.
ఉరవకొండలో కూడా మండలి చీఫ్‌విప్ పయ్యావుల కేశవ్ మేళా నిర్వహించారు. తాడిపత్రిలోనూ జేసీ బ్రదర్స్ ‘లైసెన్స్ మేళా’ పూర్తి చేశారు. కనీసం అధికారులు కూడా మేళాను టీడీపీ కార్యాలయాలు, స్థానిక ప్రజాప్రతినిధుల ఫొటోలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేసి నిర్వహించకూడదని మరిచి టీడీపీ దారిలోనే నడుస్తున్నారు. పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో చీఫ్‌విప్ పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, వరదాపురం సూరి ఏకంగా డబ్బులు అసంతృప్త నేతలు, కార్యకర్తలతో పాటు గ్రామాల్లో పది ఓట్లు ప్రభావితం చేయగలరనే వ్యక్తులను డబ్బుతో కొనే ప్రయత్నం చేస్తున్నారు. నాలగున్నరేళ్లలో రూ.కోట్ల రూపాయాలు అక్రమంగా అర్జించి ఎన్నికల ముందు ఓటర్లకు చిల్లర విదిల్చి ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునే చర్యలకు అవలభించారు. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడనుండటంతో ఆలోపే ఇలాంటి కార్యక్రమాలు ముగించేలా వ్యవహరిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు వాళ్లని నమ్మే పరిస్థితి లేదని, జిల్లాలో టీడీపీకి ఘోర పరాభావం తప్పదని విపక్షపార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
జేసీ బ్రదర్స్‌పతనంతో ప్రలోభాలు
1. పాత టీడీపీ నేతలైన కాకర్ల రంగనాథ్, గుత్తా వెంకటనాయుడు, జగదీశ్వరరెడ్డి, జయచంద్రారెడ్డి, ఫయాజ్‌బాషాలు జేసీ బ్రదర్స్‌పై వ్యతిరేకతతో పార్టీకి దూరమయ్యారు.
2. ప్రభోదానంద ఆశ్రమం ఘటనలో వేలు పెట్టారు. నియోజకవర్గానికి సంబంధించిన భక్తులే ఇక్కడ 15వేల మంది ఉన్నారు. వీరంతా జేసీ బ్రదర్స్‌ను వ్యతిరేకిస్తున్నారు.
3. ఇన్నాళ్లూ జేసీతో నడిచి, అత్యంత కీలకంగా వ్యవహరించే భోగాతి నారాయణరెడ్డి జేసీ బ్రదర్స్‌తో విభేదించారు. ఇక కలిసే ప్రసక్తే లేదని మధ్యవర్తులకు తేల్చి చెప్పారు.
ఇక లాభం లేదనుకొని నాయకులను వదిలేసి ఓటర్లకు వల వేయడం ప్రారంభించింది జేసీ కుటుంబం.
Comments
Please login to add a commentAdd a comment