
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన కొనసాగుతోంది. సోమవారం రామ్‌దుర్గ్‌లోని గాడ్చి ఆలయాన్ని సందర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. రామ్‌దుర్గ్‌లో ఎన్నికల ర్యాలీలోనూ పాల్గొన్నారు. ఉత్తర కర్ణాటకలో మూడురోజుల పర్యటనలో భాగంగా పలు ప్రచార సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత పదిహేను రోజుల్లో రాహుల్ కర్ణాటక పర్యటన ఇది రెండవది కావడం గమనార్హం.
ప్రచార సభల్లో ప్రధానంగా మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ రాహుల్ తన ప్రసంగాలకు పదును పెడుతున్నారు. మరోవైపు కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పర్యాయపదంగా మారిందని బీజేపీ చీఫ్ అమిత్ షా ఆరోపించారు. సిద్ధరామయ్య సర్కార్ అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.