సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు, కేసీఆర్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తమను తిడుతూనే తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. ఎవరో ఒకరితో పొత్తు లేకుండా బతలకలేరంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు రైతులపై హఠాత్తుగా చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు.
‘రైతు బంధు వంటి పథకాల ద్వారా కేసీఆర్.. ప్రజల మనస్సు గెల్చుకున్నారని చంద్రబాబు, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి అర్థమైంది. దీన్ని అంగీకరించేందుకు వారికి బేషజం, అహంకారం అడ్డొస్తోంది. మనం రైతు బంధు అని పెట్టుకుంటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరు మార్చి మోదీ కాపీ కొట్టారు. ఫర్వాలేదు. దేశంలో రైతులకు మంచి చేస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు తెల్లారిలేస్తే మనల్ని తిడతాడు. కానీ మన పథకాలన్నీ కాపీ కొడతడు. మనం రైతు బంధు పెట్టి రెండేళ్లయితే ఎన్నికలు దగ్గర పడటంతో చంద్రబాబుకు సడన్‌గా రైతులు గుర్తొచ్చారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతు బంధును కాపీ కొట్టిండు మనమిక్కడ కళ్యాణలక్ష్మీ అంటే పసుపు-కుంకుమ అని అక్కడొకటి పెట్టిండు. మనం ఇక్కడ అన్నపూర్ణ అని క్యాంటీన్లు పెడితే అన్నపూర్ణలో పూర్ణ తీసేసి అన్న క్యాంటీన్లు అని అక్కడ పెట్టిండు. అన్ని కాపీలు కొట్టుడే.
కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలు మాకు సేతకాదు. వీటన్నింటిపై ఒక్క చంద్రబాబుకు మాత్రమే పేటెంట్ ఉంది. కేసీఆర్ చక్రవర్తా, కాదా అనేది ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. ఒకవేళ కేసీఆర్ చక్రవర్తి అనుకుంటే మొక్కలు నాటించిన అశోక చక్రవర్తి. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి నువ్వు. నీకు, కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. మంది పెట్టిన పార్టీలో దూరి, మామ పెట్టిన పార్టీలో దూరి.. చీమలు కట్టుకున్న పుట్టలో పాము దూరినట్టు మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీని గుంజుకుంటివి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరోని తోని పొత్తుపెట్టుకోకుండా బతుకులేకపాయె. స్వయం ప్రకాశం లేకపాయె. మాటలు మాత్రం పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు. తెలంగాణ ప్రజల చైతన్యం మొన్న దేశం మొత్తం చూసింది. నాకు విశ్వాసం ఉంది. తెలుగు దేశం పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు తిప్పికొడతరు. బాబు పోతేనే జాబులు వస్తాయని ఏపీ ప్రజలకు అర్థమైంద’ని కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment