కార్యకర్తల సమావేశంలో విజయోత్సవ విల్లును సంధిస్తున్న కేటీఆర్
హైదరాబాద్ : తమ వద్దకు ఎంతమంది నేతలు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావితం చేయాలని భావించినా తెలంగాణకు ఉన్న ఏకైక నేత కేసీఆర్ అని నమ్మి ప్రజలు తీర్పు ఇచ్చారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సహా అగ్ర నేతలంతా కాలికి బలపం కట్టుకుని తిరిగినా వారిని నమ్మలేదన్నారు. కేసీఆర్‌కు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధిస్తామని చెప్పారు.సనత్‌నగర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం బుధవారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో జరిగింది.ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ నేడు తెలంగాణ ఏది ఆలోచిస్తే రేపు దేశం అది ఆలోచించే స్థితి వచ్చిందన్నారు.
రైతుబంధు పథకాన్ని మూడు రాష్ట్రాలు అమలుచేస్తున్నాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ పథకాన్ని పేరుమార్చి అమలు చేస్తారనే వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే సంతోషం అన్నారు.కొత్త ఏడాదిలో 16 ఎంపీ సీట్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. టీడీపీ కథ తెలంగాణలో ముగిసిందని, బీజేపీ వంద సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ మళ్లీ ప్రజల విశ్వాసం పొందే పరిస్థితి లేదన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గతంలో ముందస్తు ఎన్నికలకు పోయిన వారికి చేదు అనుభవాలు ఎదురయ్యాయని, కానీ కేసీఆర్ ఏది చేసినా కొత్త చరిత్రేనన్నారు. అసెంబ్లీ రద్దు, కొన్ని గంటల వ్యవధిలోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారన్నారు.గతంలో కంటే టీఆర్‌ఎస్‌కు 14 శాతం ఓట్లు పెరిగాయన్నారు. ఇంత పెద్ద విజయం సాధించామని అహంకారం పనికిరాదని అన్నారు.
కళాకారులతో డ్యాన్స్ చేస్తున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్
కాలర్ ఎగరేసుకునేలా హామీల అమలు
ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన ప్రతిహామీనీ నెరవేర్చే దిశగా పనిచేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాలర్ ఎగరేసే విధంగా హామీలు నెరవేరుతాయన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. పదవుల కోసం నేతల చుట్టూ తిరగొద్దు..ప్రజల చుట్టూ తిరగండి..మొన్నటి ఎన్నికల్లో పార్టీకి దూరమైన వారిని మళ్లీ దగ్గరకు తెచ్చుకుందామని కేటీఆర్ వివరించారు.
శ్రీనివాస్‌యాదవ్ ప్రజల మనిషి...
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ప్రజల మనిషిగా కేటీఆర్ అభివర్ణించారు.ఆయన 65 నుంచి 75 వేల మెజార్టీతో గెలవాల్సిందనీ, తగ్గినందుకు తనకు వ్యక్తిగతంగా బాధగా ఉందన్నారు. ఓట్ల గల్లంతు కూడా ఇందుకు ఓ కారణమన్నారు.ఓటర్ల నమోదును ఉధృతంగా చేయించాల్సిన అవసరం టీఆర్‌ఎస్ కార్యకర్తలపై ఉందన్నారు.
మహాకూటమి నేతల బుర్రలు పాడయ్యాయి..
ఎన్నికల ఫలితాల అనంతరం మహాకూటమి నేతల బుర్రలు పాడయ్యాయని కేటీఆర్ విమర్శించారు. ఈవీఎంలు కాదు పాడయ్యింది..వారి బుర్రలు చెడిపోయాయన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి నుంచి రోజూ మనల్ని తిడుతున్నారనీ ఆయన తిట్లను దీవెనలుగా అనుకుందామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment