
జమాత్ ఇస్లామీ హింద్ సదస్సులో మాట్లాడుతున్న మహమూద్‌అలీ. చిత్రంలో అసదుద్దీన్ ఒవైసీ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఈ ప్రాంతాన్ని 400 ఏళ్లు పాలించిన ముస్లింలు స్వాతంత్య్రానంతరం 70 ఏళ్లలో ఎస్సీ, ఎస్టీలకంటే వెనుకబాటుకు గురవటానికి.. మరింత బీదరికంలోకి నెట్టేయబడటానికి గత పాలకుల విధానాలే కారణమని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ విమర్శించారు. ముస్లింల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పాటుపడుతోందని, ప్రభుత్వ పథకాలను ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలో రెండు రోజుల పాటు జరిగిన జమాత్ ఇస్లామీ హింద్ సదస్సులో ఆదివారం మహమూద్ అలీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకంటే వెనుకబడిన ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ముస్లింలు సైతం పాటుపడాలని, ముస్లిం వర్గాలు తమలో ఉన్న విభేదాలను పక్కనపెట్టి సంఘటితం అవ్వాలని సూచించారు. ముస్లిం యువత వృత్తి నైపుణ్యాలను పెంపొందిం చుకుని వ్యాపార రంగంలో ముందుకెళ్లాలని, మహిళలు కూడా అన్నిరంగాల్లో ముందడుగు వేసి భర్తకు చేదోడువాదోడుగా నిలవాలన్నారు. ముస్లింలు తమ పిల్లల విద్యపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముస్లిం పిల్లల విద్యకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని, వీటిలో 50 వేల మంది మైనారిటీ విద్యార్థులు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు.
ముస్లింల పాత్ర చిరస్మరణీయం
శాసనమండలిలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. దేశ నిర్మాణంలో ముస్లింల పాత్ర చిరస్మరణీయమని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ముస్లిం యోధుల జీవితాలను నేటి తరానికి తెలియజేయాలని సూచించారు. ముస్లింలు తమ సంస్కృతీ సంప్రదాయాలతో దేశానికి ఎనలేని సేవలందించారన్నారు. ఇస్లాం ధర్మం దేశంలో కత్తిబలంతో వ్యాపించలేదని, ప్రేమ, సోదరభావం, త్యాగస్ఫూర్తితో విస్తరించిందని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మొట్టమొదటి యోధుడు టిప్పుసుల్తాన్‌ను లక్ష్యంగా చేసుకోవడం విషాదకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రను మార్చే కుట్రలు పన్నుతోందని, ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడితే చరిత్ర క్షమించదని హితవు పలికారు. కార్యక్రమంలో జమాత్ ఇస్లామీ ఉపాధ్యక్షుడు సాదతుల్లా హుస్సేనీ, రాష్ట్ర అధ్యక్షుడు హమీద్ మహ్మద్ ఖాన్, కార్యదర్శులు, వివిధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ సదస్సు విజయవంతంగా పూర్తయిందని, జమాత్ ఇస్లామీ హింద్ నగర అధ్యక్షుడు హఫీజ్ రషాదుద్దీన్ అన్నారు.
దేశాన్ని బలహీనపరుస్తున్నారు..
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. దేశంలోని ముస్లింలను అభద్రతాభావానికి గురిచేసే ఘటనలు తీవ్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం పాలకులను, యోధులను దేశద్రోహులుగా చిత్రీకరించి విద్వేష వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. విభజన రాజకీయాలు, గోరక్షణ, లవ్‌జిహాద్ తదితర సాకులతో విద్వేషం చిమ్మి.. మనుషుల ప్రాణాలను బలిగొని దేశాన్ని బలహీనపరుస్తున్నారని ఆయన విమర్శించారు. షరియత్ చట్టాల్లో జోక్యం సరికాదని, షరియత్ పరిరక్షణకు ధార్మిక, సామాజిక, రాజకీయ పార్టీల్లో ఉన్న ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రేమకు చిహ్నంగా కట్టిన తాజ్‌మహల్‌పై విషం చిమ్మే నీచ రాజకీయాలకు పాల్పడటం దారుణ మన్నారు. మత రాజకీయాలతో పబ్బం గడుపుకునే బీజేపీకి ప్రజలే బుద్ధిచెబుతారని, గుజరాత్‌లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment