
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చాలా అన్యాయం చేశాయని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. బుధవారం తెలంగాణభవన్ లో మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ సమక్షంలో షాద్‌నగర్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ... తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎంత అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు.
బషీర్‌బాగ్ కాల్పుల్లో రైతులను కాల్చి చంపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని, ఉద్యమం ద్వారా వచ్చిందని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే లీడర్ అని, కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరో తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మాటలు ప్రజలు నమ్మరని.. ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ పార్టీలు రాష్ట్రంలో తుడిచిపెట్టుకు పోతాయన్నారు.