సాక్షి, పెద్దపల్లి: రాష్ట్రంలో కోటి మందికి కళ్ల పరీక్షలు జరిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుత కార్యక్రమాన్ని చేపడుతున్నారని, పనిలో పనిగా కాంగ్రెస్ నాయకుల కళ్లకు కూడా పరీక్షలు చేయిస్తే బాగుంటుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వైపు ప్రపంచమే తొంగి చూస్తుండగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం అడ్డుకునేందుకు నానా తిప్పలు పడ్డారన్నారు. ట్రిబ్యునల్‌కు వెళ్లి కేసు వేశారన్నారు. తెలంగాణ వికాసం కోసం తాము ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ విధ్వంసం కోసం కుట్రలు పన్నుతోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అక్కడి పార్టీలు మేనిఫెస్టోలో పెట్టుకున్నాయన్నారు.
పంజాబ్, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలను చూసి ప్రశంసిస్తుండగా, ఇక్కడి కాంగ్రెస్ నాయకుల కళ్లు మండిపోతున్నాయన్నారు. అందుకే కంటి పరీక్షల కార్యక్రమంలో కాంగ్రెస్ నేతల కంటి పొరలు తొలగించేలా చికిత్స చేయిస్తేగాని నిజాన్ని చూడలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నేతలకు కళ్ల పరీక్ష చేయిస్తాం: హరీశ్
May 7 2018 1:44 AM | Updated on Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement