
సాక్షి, అమరావతి : నిందలు వేశారని వైఎస్ జగన్ రాజధానిలో ఇల్లు, పార్టీ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకోలేదని.. అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగించాలని ఆయన సంకల్పించారని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. వైఎస్ జగన్‌కు అధికారం అప్పగిస్తే రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని టీడీపీ నేతలు, ఎల్లో మీడియా విష ప్రచారం చేసిందని రోజా మండిపడ్డారు. అమరావతిలో వైఎస్ జగన్ స్థిర నివాసం, పార్టీ కార్యాలయ నిర్మాణాలు ఎల్లో మీడియాకు చెంపపెట్టు లాంటిదని అన్నారు. వైఎస్ జగన్ గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
చంద్రబాబుకు అయిదేళ్లు అధికారం కట్టబెట్టినా రాజధానిలో స్థిర నివాసం గానీ, పార్టీ కార్యాలయం గానీ నిర్మించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఏపీకీ వైఎస్ జగన్ పర్మనెంట్ సీఎం అవుతారని, బాబు టెంపరరీ సీఎంగా మిగిలిపోతారని ఆమె జోస్యం చెప్పారు. గృహ ప్రవేశం.. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాలకు వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ ఆహ్వానాలు అందాయని తెలిపారు. కానీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు ఇంట్లోకి అనుమతి లేదని ఎద్దేవా చేశారు.
కట్టు బట్టలతో వచ్చి ఏం చేశావ్..
రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో హైదరాబాద్ విడిచి వచ్చానని చెప్పుకుంటున్న చంద్రబాబు అమరావతిలో ఇప్పటి వరకు ఎందుకు స్థిర నివాసం ఏర్పరచుకోలేదని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. బాబు మాటల మనిషి మత్రామేనని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టిన చంద్రబాబు రాజధానిలో స్థిర నివాసం ఏర్పాటును ఎందుకు కాపీ కొట్టడం లేదని ప్రశ్నించారు. మరో రెండు నెలల్లో బాబు హైదరాబాద్‌లో ఉన్న సొంతింటికి చేరుకుంటారని జోస్యం చెప్పారు.
గృహ ప్రవేశం.. పార్టీ కార్యాలయం ప్రారంభం..
ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి బుధవారం ఉదయం గృహప్రవేశం చేశారు. సర్వమత ప్రార్థనల మధ్య ఉదయం 8.19 గంటలకు వైఎస్ జగన్, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, తలశిల రఘురాం, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment