
సాక్షి, కిర్లంపూడి: చంద్రబాబు, కోడెల అంతిమ యాత్రలో బాగానే నటించారు.. కానీ ఓ వ్యక్తి మీద నిజంగానే ప్రేమ ఉంటే.. యాత్రకు వచ్చిన వారికి నమస్కారం చేస్తారు.. లేదా మౌనంగా ఉంటారు.. కానీ రెండు వేళ్లు చూపడం ఏం సంస్కారం అని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ నటన అంతా రాజకీయ లబ్ది కోసం కాదా అని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు చిలకపలుకులు పలుకుతున్నారని ముద్రగడ ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కోడెలను పిలిపించుకుని.. మీ కుమారుడి వల్ల చెడ్డపేరు వస్తోంది.. అదుపులో పెట్టుకొండి అని వార్నింగ్ ఇవ్వడం.. అందుకు కోడెల మీ పుత్రరత్నం వజ్రమా అని కోడెల చంద్రబాబును ప్రశ్నించడం నిజం కాదా అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందంటూ బాధపడుతున్నారు.. కానీ దానికి ఆజ్యం పోసిందే చంద్రబాబే కదా అన్నారు.
గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 30 మందిని బలి తీసుకున్నారని ఆరోపించారు. తనపై కేసులు పెట్టడానికి వీలు లేకుండా ఏకంగా పోలీసుల చేతే సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయించిన ఘనత చంద్రబాబుదే అంటూ ధ్వజమెత్తారు. తమ జాతి ఉద్యమానికి.. తమపై అక్రమ కేసులు పెట్టించి.. ఈ రోజు వారంతా కోర్టుల చుట్టూ తిరగడానికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. ప్రజలు అధికారం ఇచ్చింది అణాగారిని వర్గాలకు వెలుతురు ఇవ్వడం కోసమే కానీ అణచివేయమని కాదంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అరాచక పాలనలో చంద్రబాబు సామన్య ప్రజలకు బతికే అవకాశం ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలకు రాక్షస పాలన చూపించిన బాబు నేడు ప్రజల కోసమే బతుకున్నాను అంటూ దొంగ మాటలు చెబుతూ.. ఇంకా ఎంత కాలం బట్టలు తడిచిపోయేలా కన్నీరు కారుస్తూ నటిస్తారని ముద్రగడ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment