
సాక్షి, కృష్ణా(నూజివీడు): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూజివీడుకి చేరుకున్నారు. గాంధీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో జనసంద్రమైంది. సభలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే వరకు కృషి చేస్తామన్నారు. 150 సీట్లకు పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నూజివీడుకి ట్రిపుల్ ఐటీ తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌దే అని గుర్తుచేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ తాగునీటి సమస్య లేకుండా చేశారని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నేత కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. త్వరలోనే మనకు మంచి రోజులు వస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదా తీసుకొచ్చే ఏకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పారు. పోలవరం, రాజధానులు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు.