
సాక్షి, అమరావతి : అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే ఇబ్బందులు వస్తాయని.. గతంలో హైదరాబాద్‌లో అదే జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. అమరావతిలోని సచివాలయంలో సోమవారం మంత్రి మాట్లాడుతూ.. రాజధాని రైతుల భూములకు ఎలాంటి ఢోకా లేదని భరోసానిచ్చారు. రైతుల భూములపై హైపవర్ కమిటీ స్పష్టం ఇస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టులను కొట్టిన వారిపై కేసులు పేడితే.. చంద్రబాబు ఎందుకు రద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడి చేస్తే చంద్రబాబు కనీసం స్పందించలేదని, రాజధాని రైతులను ముంచేసి చంద్రబాబు ఇప్పుడు డ్రామాలాడుతున్నాడని విమర్శించారు.
రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై పూర్తి ఆధారాలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో భారీగా ఇసుక దోపిడీ జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఎన్జీటీ రూ. 100 కోట్ల జరిమనా విధించిందని వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు 389 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని ఇసుక రీచ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఇసుక రీచ్‌లను పర్యవేక్షిస్తామని తెలిపారు.