
మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఓటు వేయవద్దని ప్రచారం చేస్తోన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి
సాక్షి, ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఇప్పుడు రెబెల్ నాయకులతో తలనొప్పి వస్తోంది. ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి చేరిన అభ్యర్థులకు ప్రస్తుతం పెద్ద సమస్య ఏర్పడింది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు వారికి సహకరించే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన వారందరికీ సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. గతంలో ఆ స్థానాల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన వారికి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో వారు టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు.
2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు. అనంతరం పార్టీ మారి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిలబడి సుమారు 22 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి పార్టీ టిక్కెట్ తనకు ఇవ్వకుండా పార్టీ మారి వచ్చిన మంచిరెడ్డికి ఇవ్వడంతో ఆయన తిరుగుబావుటా వేశారు. మంచిరెడ్డి ఓడించాలని ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. బండరావిరాలలో శుక్రవారం ఆయన స్థానికులతో మాట్లాడుతూ.. మంచిరెడ్డికి ఓటు వేయొద్దని కోరారు. పార్టీ మారి వచ్చిన అభ్యర్థులందరికీ ఇదే పెద్ద సమస్యగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment