
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో దాదాపు 70 లక్షల ఓటర్లకు సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయని, అందువల్ల కుదించిన ఓటరు నమోదు షెడ్యూలును రద్దు చేసి, ముందుగా జారీచేసిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో జనవరి 1, 2019వ తేదీ ప్రామాణికంగా ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా, దానిని రద్దు చేస్తూ 2018 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా స్వల్పకాలిక ఓటరు నమోదు షెడ్యూలును జారీచేసిందని, 4 నెలల కాలంలో సరిదిద్దాల్సిన ఓటరు జాబితాను నాలుగు వారాలకు కుదించిందని, ఈ సమయం సరిపోదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని మొద టి ప్రతివాదిగా చేర్చారు. 70 లక్షల ఓటర్లకు సం బంధించి అవకతవకలున్నాయని, తాము బలమైన సాక్ష్యాధారాలను ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించామని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం మౌనం దాల్చిందన్నారు. వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని మర్రి శశిధర్‌రెడ్డి తెలిపారు.