సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో (జమిలి) ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి ప్రజల ముందుకు ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా బుధవారం నాడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వద్ద చేసే ప్రసంగంలో ప్రధానంగా ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎంతో ఖర్చు కలసి వస్తుందని, ఎన్నికల ప్రచారం, బడానాయకుల ప్రచారం కారణంగా కలిగే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని, ఎన్నికల కోడ్ కూడా దేశమంతా ఒకేసారి మొదలైన ఒకేసారి ముగుస్తుంది కనుక ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు అంతరాయం ఉండదని, మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా అనుకుంటారు.
భారత పార్లమెంటరీ వ్యవస్థలో జమిలి ఎన్నికలు లాభమా, నష్టమా అన్న అంశాన్ని పక్కన పెడితే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి. అది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు కనుక, వచ్చే మే నెలలో జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికలను ఫిబ్రవరికి, ఈ ఏడాది డిసెంబర్, వచ్చే జనవరిలో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరికి లాక్కెల్తే పార్లమెంట్‌తోపాటు 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించవచ్చు. అలా జరగాలంటే రాష్ట్రాల ప్రభుత్వాలకు నచ్చచెప్పి ముందుగానే అసెంబ్లీలను రద్దు చేయడం లేదా గవర్నర్ పాలన విధించడం ద్వారా పార్లమెంట్ ఎన్నికలతో ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించవచ్చు.
చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ‘సీ ఓటర్’ సర్వే స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకే సిద్ధమవుతోంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మిగతా రాష్ట్రాలపై, పార్లమెంట్ ఎన్నికలపై పడకూడదన్నదే వ్యూహం అవుతుంది. లా కమిషన్ కూడా జమిలి ఎన్నికలకే ఓటేసింది. కానీ ఈ ఎన్నికల వల్ల డెమోక్రసీకి సంబంధించి పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఏ రాజకీయ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రాలేదంటే ఆయా పార్టీల ప్రభుత్వాలు ప్రజలకు ఇష్టం లేదన్న మాట. అయితే ఎన్నికల్లో ఓ అసెంబ్లీలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. జమిలీ ఎన్నికల్లో అలా కుదరదు కనుక, బేర సారాల ద్వారా ఏదో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ప్రభుత్వం మధ్యలో పడిపోతే మళ్లీ ఎన్నికలు వచ్చే వరకు గవర్నర్ పాలన విధించాల్సి ఉంటుంది. మధ్యంతర ఎన్నికలను అనుమతిస్తే అప్పుడు ఎన్నికయ్యే ప్రభుత్వం పార్లమెంట్ కాలం వరకే మనుగడలో ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలకు విరుద్ధమే!
Comments
Please login to add a commentAdd a comment