
సాక్షి, అమరావతి: చంద్రబాబు, టీడీపీ తమను పెట్టిన ఇబ్బందులను మరిచిపోలేమని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో గురువారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు పదవుల మీద వ్యామోహం లేదని, తమ నాయకుడు వైఎస్ జగన్ కోసమే పని చేస్తున్నామన్నారు. గతంలో పోరాట వీరులం, ఇప్పుడు పరిపాలన దక్షులమంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కాకూడదని ఓ 60 మంది ఎమ్మెల్యేలం దళంగా ఏర్పడ్డామని వెల్లడించారు. ‘మా తల తీసి పక్కన పెడితే చంద్రబాబు సీఎం కాడని చెబితే పక్కన పెట్టేస్తామ’ని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు.
చంద్రబాబుకు కోటంరెడ్డి సవాల్
గత సభలో తమకు చంద్రబాబు నేర్పిన విద్యనే ఇప్పుడు ప్రదర్శిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో పిచ్చాపాటిగా మాట్లాడుతూ... ‘గతంలో వైఎస్ జగన్‌ను అప్పటి మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అప్పటి మంత్రుల కామెంట్లకు నాటి సభలో చంద్రబాబు చప్పట్లు కొట్టారు. నాటి వ్యాఖ్యలకు చంద్రబాబు విచారం వ్యక్తం చేస్తే.. నేనూ నా కామెంట్లపై క్షమాపణ చెబుతా. నావి కానీ ఆడియో టేపులను నావే అని టీడీపీ పదే పదే విమర్శిస్తోంది. చంద్రబాబు ఆడియో టేపులు, నావి అని చెబుతున్న ఆడియో టేపులను ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించడానికి టీడీపీ సిద్దమా? ఎవరిది తప్పని తేలితే వారు శిక్ష అనుభవించాలి. నేను శిక్ష అనుభవించడానికి సిద్ధం, చంద్రబాబు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment