సాక్షి, భైంసా: దేశం మొత్తం అంబేద్కర్ బాటలో నడుస్తుంటే ఆయన పేరెత్తడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టపడటం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో ఏ ఒక్క ప్రభుత్వ పథకానికి అంబేద్కర్ పేరు పెట్టలేదన్నారు. కేసీఆర్‌కు అంబేద్కర్ పేరు నచ్చలేదని, అందుకే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఆయన పేరు తీసేశారని తెలిపారు. ఇది అంబేద్కర్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా భైంసాలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో టీఆర్‌ఎస్ సర్కారు విఫలమైందని ధ్వజమెత్తారు. అవినీతితో కేసీఆర్ కుటుంబం కోట్లు దండుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇచ్చారా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎంత మందికి వచ్చాయని అడిగారు. ప్రాజెక్టుల పేరు మార్చి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులు, ఆదివాసీల కోసం తాము తెచ్చిన పథకాలను పక్కన పెట్టారని పేర్కొన్నారు. అడవులపై గిరిజనులకు తాము పూర్తి హక్కులు కల్పించామని చెప్పుకొచ్చారు.
త్వరలోనే మోదీ, కేసీఆర్ పాలన అంతం
విదేశాల్లోని నల్లధనం వెలికి తీసి, ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఏమైందని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రఫేల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి రూ. 30 కోట్లు లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను కాదని రిలయన్స్ డిఫెన్స్ కంపెనీకి అప్పగించారన్నారు. దేశానికి కాపలాదారుగా ఉంటానన్న మోదీ.. సంపన్నులను మాత్రమే కాపలా కాస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా అబద్ధాలే చెబుతారని అన్నారు. మోదీ, కేసీఆర్ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించనుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment