రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా? | Rajnath Singh's return to key Cabinet committees shows Modi govt | Sakshi
Sakshi News home page

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

Published Sat, Jun 8 2019 4:07 AM | Last Updated on Sat, Jun 8 2019 4:07 AM

Rajnath Singh's return to key Cabinet committees shows Modi govt - Sakshi

న్యూఢిల్లీ: సాధారణంగా ప్రధానమంత్రి తర్వాత ప్రమాణం స్వీకారం చేసే వ్యక్తినే ప్రభుత్వంలో నంబర్‌ 2గా భావిస్తారు. అలా చూస్తే మోదీ తర్వాత ప్రమాణం చేసిన రాజ్‌నాథ్‌కే ఆ స్థానం దక్కాలి. కానీ మొత్తం ఎనిమిది కేబినెట్‌ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అన్ని కమిటీల్లోనూ అమిత్‌ షాకి సభ్యత్వం కల్పించారు. రాజ్‌నాథ్‌కు తొలుత కేవలం రెండింటిలో మాత్రమే ప్రాతినిధ్యం కల్పించడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. మోదీ ప్రొటోకాల్‌ ప్రకారం వ్యవహరించలేదని, తన కుడిభుజం అమిత్‌ షాని నంబర్‌ టూ అని చాటి చెప్పడానికే రాజ్‌నాథ్‌ ప్రాధాన్యం తగ్గించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన మోదీ రాత్రికి రాత్రి కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు మొత్తం ఆరు కమిటీల్లో రాజ్‌నాథ్‌కు స్థానం కల్పించారు.  

తెరవెనుక ఏం జరిగింది ?  
బుధవారం పలు కమిటీలు ఏర్పాటు చేసిన ప్రధాని.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు రెండు కమిటీల్లోనే చోటు కల్పించారు. అమిత్‌ షాను అన్ని కమిటీల్లోనూ పెట్టి, రాజ్‌నాథ్‌ను రెండింటికే పరిమితం చేయడం సహజంగానే కలకలం రేపింది. ‘‘రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఇది తీవ్ర అవమానం. అలాగని ఆయన అవమానాలు దిగమింగుతూ ఉండే నాయకుడైతే కాదు‘‘ అని బీజేపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టుగానే రాజ్‌నాథ్‌ చేతులు ముడుచుకొని కూర్చోలేదని, తన హోదాకు భంగం కలగడంతో రాజీనామాకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అంతేకాదు ఆరెస్సెస్‌ పెద్దల వద్ద కూడా రాజ్‌నాథ్‌ ఈ విషయం ప్రస్తావించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ప్రధాని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారని, రాజ్‌నాథ్‌కు ఫోన్‌ చేసి బుజ్జగించారని, రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నచ్చజెప్పారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఆ క్రమంలోనే గురువారం రాత్రి రాజ్‌నాథ్‌కు మరిన్ని కమిటీల్లో చోటు కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. ముఖ్యంగా రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించడం వల్ల.. అన్ని అంశాలను పర్యవేక్షించే అధికారం రాజ్‌నాథ్‌కు ఉంటుందని, ఆయన ప్రొటోకాల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని మోదీ మద్దతుదారులు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement