సాక్షి, వికారాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దమ్ముంటే కొడంగల్ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉంది కాబట్టి కేసీఆర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అనంతరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల లోపు ఆ ఇద్దరు ఎంపీలు కాంగ్రెస్‌లో చేరతారని, చేతనైతే వారిని ఆపాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సవాల్ చేశారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారన్న రేవంత్.. పట్నం సోదరులు తనను ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. తాను ఏనాడు కొడంగల్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించలేదని, అందుకే ఈసారి కూడా కచ్చితంగా గెలిచి తీరతానని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఆపద్ధర్మ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కొడంగల్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment