బాబు మోసాలపై సమర శంఖం | Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు మోసాలపై సమర శంఖం

Published Thu, Feb 7 2019 1:04 PM | Last Updated on Thu, Feb 7 2019 1:04 PM

Sajjala Ramakrishna Reddy Slams Chandrababu Naidu - Sakshi

మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పక్కన మాజీ మం్రత్రులు బాలినేని, మహీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గరటయ్య, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్, దర్శి సమన్వయకర్త మద్ది ట్టి వేణుగోపాల్‌

ఒంగోలు సిటీ: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు సీఎం చంద్రబాబునాయుడు రకరకాల కార్యక్రమాలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ మోసాలను తిప్పికొట్టడానికే తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ సమర శంఖారావం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. బుధవారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు రుణమాఫీ చేయకుండానే రైతుల్ని, డ్వాక్రా మహిళలను మోసం చేశారని విమర్శించారు. బడ్జెట్‌లో అంకెల గారడీతో మరో మోసానికి తెరలేపారన్నారు. ప్రజాధనాన్ని భారీగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. వీటన్నింటిని తిప్పికొట్టేందుకు జగన్‌ సమర శంఖారావం పూరిస్తున్నారన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆయన ఈ నెల 13వ తేదీన ఒంగోలుకు వస్తున్నారని చెప్పారు. ఉదయం మేధావులు, తటస్థులతో సమావేశమవుతారని, మధ్యాహ్నం నుంచి క్షేత్ర స్థాయిలో బూత్‌ కమిటీల ప్రతినిధులతో సభజరుగుతుందని వెల్లడించారు.

వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?
రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.8,100 కోట్లు బడ్జెట్‌లో చూపించకుండా ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తారని సజ్జల ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా అన్నదాతా సుఖీభవ అంటూ మరో మోసపూరిత పథకాన్ని ప్రకటించినట్లుగా పేర్కొన్నారు. కేవలం ఎన్నికల నుంచి బయటపడేందుకు రెండు, మూడు నెలలుగా తాయిలాలను ప్రకటించడం మోసం కాదా..? అని నిలదీశారు. పింఛన్ల పెంపు, రైతులకు పెట్టుబడి రాయితీ, రుణమాఫీ చేస్తామని రెండేళ్ల కిందటే జగన్‌ నవరత్నాల్లో ప్రకటించినట్లుగా గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను మాట తప్పకుండా నెరవేర్చే జగన్‌ కావాలో.. మాయ మాటలతో మోసం చేసే చంద్రబాబు కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు.

దీటైన అభ్యర్థులను దించుతాం..
ఇటీవల పార్టీలో చేరికలపై సజ్జల స్పందిస్తూ పార్టీ విజయం కోసం అక్కడక్కడా మార్పులు తప్పవని చెప్పారు. దాదాపు 150 స్థానాల్లో ఇప్పుడు పార్టీ బాధ్యతలు చూస్తున్న వాళ్లే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారని స్పష్టం చేశారు. కేవలం 25–30 స్థానాల్లోనే అభ్యర్థుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదన్నారు. ముందస్తుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ఆలోచన లేదన్నారు. బి–ఫారం ఇచ్చే దాకా సస్పెన్స్‌ కొనసాగుతుందని తెలిపారు. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసి దానికి అనుగుణంగా సరైన అభ్యర్థులను రంగంలోకి దింపడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

సుశిక్షితులైన సైనికుల్లా తయారు కావాలి..
జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు అందరూ సుశిక్షుతులైన సైనికుల్లా తయారు కావాలని సజ్జల పిలుపునిచ్చారు. ఎన్నికల ముందుగా బూత్‌ కమిటీల సభ్యులకు నాయకులు దిశానిర్దేశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటర్లకు గాలం వేయడానికి చంద్రబాబు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారని అన్నారు. కార్యకర్తలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వీటిని దీటుగా తిప్పికొట్టడానికి ప్రజల్లో తగిన చైతన్యం తీసుకురావడమే అని అన్నారు. నవరత్నాల ద్వారా జగన్‌ ప్రకటించిన పలు పథకాలను చంద్రబాబు కాపీ కొట్టారని అన్నారు. ఎన్నికల్లో ఓటర్లకు లంచం ఇవ్వడం, ప్రలోభాల ఎరకు చంద్రబాబు సిద్ధమయ్యారని వివరించారు. కార్యకర్తలు నిరంతరం నిఘా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నియోజకవర్గాల సమన్వయకర్తలపై ఉన్న బాధ్యతలను ప్రస్తావించారు. అనునిత్యం ప్రజల్లోనే ఉండాలన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ మరోసారి మోసానికి పాల్పడిన వైనాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. అంతకు ముందు పార్టీ అనుబ«ంధ విభాగాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో జగన్‌ పర్యటనను జయప్రదం చేయాలని  దిశానిర్దేశం చేశారు. శంఖారావం కార్యక్రమం కోసం పార్టీ నాయకులతో కలిసి వేదిక కోసం స్థలాల పరిశీలన చేశారు. సమావేశంలో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్, నియోజకవర్గాల సమన్వయకర్తలు అన్నా రాంబాబు, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, రావి రామనాథంబాబు, మద్దిశెట్టి వేణుగోపాల్, బాచిన చెంచు గరటయ్య, మాదాసి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement