
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాటలు ఘనంగా ఉంటాయే తప్పా పనులు జరగవని శాసనమండలి ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ మంత్రిగా పూర్తిగా విపలమయ్యారని, ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. వాహనాలపై కాకుండా నడుచుకుంటూ పోతే తొందరగా వెళ్లే దుస్థితి ఏర్పడిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త రోడ్లు కాదుకదా పాత రోడ్లకు మరమ్మత్తులు కూడా చేయలేదని ఆరోపించారు. నగరంలోని అన్ని రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉన్నాయని.. కేటీఆర్ ఏ రోడ్డుకు వస్తారో రావాలని బహిరంగ చర్చకు సిధ్దమని షబ్బీర్ అలీ సవాల్ విసిరారు.
కేసీఆర్ పాలన గురించి..
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేతిలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా అయిందని షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. టీఆర్‌ఎస్ నాయకులను గ్రామాల్లో తన్ని తరిమే రోజులు తొందరలోనే వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకం బోగస్ అని, పైపులలో 60 శాతం కమీషన్ వస్తుందని గుంతలు తవ్వి పైపులు వేశారని విమర్శించారు.
సెప్టెంబర్ 1 నుంచి చైతన్య యాత్ర
కాంగ్రెస్ పార్టీ తలపెట్టనున్న బస్బు చైతన్య యాత్ర సెప్టెంబర్ 1 నుంచి తిరిగి ప్రారంభం అవుతుందని షబ్బీర్ తెలిపారు. ఇప్పటివరకు 40 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర నిర్వహించామని.. మిగిలిన నియోజకవర్గాల్లో బస్సు చైతన్య యాత్ర ఉండనుందని పేర్కొన్నారు. బస్సు యాత్ర కోసం సబ్ కమిటీ వేశామని, రెండు రోజుల్లో యాత్ర రూట్ ఫైనల్ అవుతుందని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బస్సు యాత్రలో ఒక చోట పాల్గొంటారని, సోనియా గాంధీ కూడా పాల్గొనేలా ప్రయత్నిస్తున్నామని షబ్బీర్ పేర్కొన్నారు.