సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ నిర్ణయాన్ని ఆమె అభినందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సోనియా గాంధీ గురువారం లేఖ రాశారు. ‘కరోనా నివారణకు మీరు తీసుకున్న 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్ స్వాగతిస్తున్నాం. ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చెబుతున్నా’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా సోనియా గత నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రధానికి రెండు లేఖలు రాయడం గమనార్హం.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సోనియా కొన్ని సూచనలు చేశారు. ప్రజలను కాపాడేందుకు వైద్యులు కృషి చేస్తున్న వైద్యుల వ్యక్తిగత రక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఆస్పత్రులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెంటిలేటర్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలతో ప్రత్యేకమైన వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ సూచించారు. కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ఈఎంఐ చెల్లింపులను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ కాలంలో బ్యాంకులు వసూలు చేయాల్సిన వడ్డీని కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. (కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సాయం)
దీనితోపాటు రోజువారీ కూలీలు, ఉపాధి హామీ కులీలు, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, వ్యవసాయ కూలీలతోపాట సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీతో సహా విస్తృత ఆధారిత సామాజిక రక్షణ చర్యలను చేపట్టాలని ఆమె ప్రధానిని కోరారు. అవసరమైన పన్ను మినహాయింపులతో సమగ్ర రంగాల వారీగా ఉపశమన ప్యాకేజీని కూడా ప్రకటించాలని సోనియా గాంధీ ప్రధానికి సూచించారు. కాగా కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఆదుకునేందుకు కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని కేటాయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment