ఎన్నికల ప్రచారంలో బండారు వెనక నడుస్తున్న బాబ్జీ
పెందుర్తి: ‘అదిగో మూడు నల్లకార్లు వస్తున్నాయి. అందులో అన్న పెద్ద దొంగ.. తమ్ముడు చిన్న దొంగతో పాటు వాళ్ల కుడిఎడమల్లో ఉన్న వాళ్లూ దొంగలే. మా చంద్రబాబుకు బుద్ధి లేక అతడ్ని మా పార్టీలోకి రానిచ్చారు. అలాంటి వాళ్లకు నా పక్కన ఎన్నటికీ స్థానం లేదు’కొన్నాళ్ల కిందట సబ్బవరం మండల పరిషత్ మధ్యంతర ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు గండి బాబ్జీ, అతడి తమ్ముడు రవిపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన ఘాటు విమర్శలు ఇవి.
‘మావి నల్లకార్లు అయితే అతడిది.. అతడి కొడుకుది తెల్లకార్లు.. నియోజకవర్గంలో చేసేవన్నీ వైట్‌కాలర్ నేరాలే. ఇద్దరూ కలిపి దోపిడీలు తప్ప పాలన ఎక్కడా చేయడం లేదు.. చంద్రబాబు ఈసారి ఈ దగాకోర్లకు టికెట్ ఇవ్వడు. పెందుర్తి నుంచి ఈసారి టీడీపీ టికెట్ నాదే.. తప్పితే రెబల్ అవతారం ఎత్తైనా బండారును మట్టి కరిపిస్తాను’అదే సమయంలో ఎమ్మెల్యే బండారు, అతడి కొడుకుని ఉద్దేశించి గండి బాబ్జీ కౌంటర్ ఎటాక్.
అప్పట్లో ఈ ఇద్దరి టీడీపీ నేతల ‘స్ట్రీట్ ఫైట్’చూసిన ఇరువురి అనుచరులు కూడా ‘సై’అంటూ కాలుదువ్వుకున్నారు. ఆ సన్నివేశాన్ని చూసి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనించసాగారు.
సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ప్రత్యర్థి పార్టీ నుంచి తొలి జాబితా లోనే ఉత్సాహవంతుడైన యువకుడి పేరును ప్రతిపక్ష నేత ప్రకటించారు. కానీ అధికార పక్షంలో మాత్రం టికెట్ కోసం గండి–బండారు మధ్య పోరు సాగింది. చివరకు చచ్చీచెడీ.. బెదిరించో.. బుకాయించో.. సాగిలాపడో బండారే టికెట్‌ను ఎత్తుకొచ్చేశాడు. దీంతో అవమాన భారంతో రగిలిపోయిన బాబ్జీ వర్గీయులు ‘ఇన్నాళ్లు బండారు మమ్మల్ని చిత్రహింసలు పెట్టాడు.. తమను కంటికి రెప్పలా చూసుకునే మా గురువు సత్తా చూపుతాడు.. బండారుకు ఇక చుక్కలే’అంటూ బీరాలు పోయారు.
మళ్లీ సీన్ కట్ చేస్తే.. మొగలిపురంలోని బాబ్జీ ఇంటికి బండారు, కొడుకు వెళ్లడం.. అన్న బాబ్జీ.. తమ్ముడు రవి చేతిలో చెయ్యివేసి ఆహ్వానించడం.. భోజనాలు చేయడం.. చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం.. గండి బాబ్జీ వీధుల్లో తిరుగుతూ బండారుకు దాసోహం కావడం చూస్తున్న జనం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. పెందుర్తి వీధుల్లో పౌరుష రసం పొంగుతుందని భావించిన ఒకరికి ఒకరు లొంగిపోయి ఓట్ల కోసం ఒకరు.. నామినేటెడ్ పదవి కోసం ‘రాజీ’రసాన్ని విరజిమ్మడాన్ని బాబ్జీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నేళ్లూ బాబ్జీ మనుషులుగా బండారు, అతడి కొడుకు చేతిలో చావుదెబ్బలు తిన్న మాకు ఏంట్రా ఈ ఖర్మ అంటూ తలలు పట్టుకుంటున్నా రు. మరోవైపు బండారు–బాబ్జీ ‘స్ట్రీట్ డ్రామా’ ను చూస్తున్న ప్రజలు మాత్రం మా వద్ద దోచుకున్న సొమ్ము పట్టుకెళ్లడానికి ‘నల్లకార్లు–తెల్లకార్లు’ఒక్కటైపోయాయంటూ నిట్టూరుస్తున్నారు.
బాబ్జీ ఈ అవమానాలను మరిచిపోయావా?
♦ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టీడీపీలో చేరడాన్ని బండారు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో చేరిన కొత్తలో బాబ్జీని, ఆయన అనుచరులను హీనంగా చూసేవారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు కూడా రానివ్వకుండా అంటరానితనం చూపేవారు.
♦ 2016 చివర్లో సబ్బవరం ఎంపీపీ మధ్యంతర ఎన్నిక సమయంలో బండారు–బాబ్జీ వర్గీయుల మధ్య పోటీ ఏర్పడింది. ఒకే పార్టీకి చెందిన వీరు తమ వర్గం వారికి ఎంపీపీ పదవి కట్టబెట్టాలన్న పంతంతో ఎంపీటీసీలకు ‘ప్రత్యేక క్యాంప్’లు కూడా నిర్వహించారు. చివరకు హైవోల్టేజ్ డ్రామాలో బాబ్జీ వర్గానికి చెందిన వ్యక్తి ఉమామహేశ్వరరావుకే ఆ పదవి దక్కింది. దీంతో బండారు తీవ్ర అవమాన భారంతో రగిలిపోయారు. ఎంతలా అంటే బాబ్జీ మనిషి అయిన ఎంపీపీ పాల్గొన్న ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమానికి కూడా బండారు నేటికీ హాజరు కాలేదు. అంతేకాదు ఎంపీపీపై భూఆక్రమణ కేసులు కూడా పెట్టించారు.
♦ వంగలి సమీపంలో పెట్రో వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు కూడా వచ్చారు. అయితే ఆ కార్యక్రమానికి బాబ్జీని రాకుండా అడ్డుకున్నారు బండారు. ఆ సమయంలో బాబ్జీ వేదిక వద్దే ఆందోళన చేయడం పెద్ద దుమారమే రేగింది.
♦ బండారుకు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ బాబ్జీ మనుషులపై కక్షసాధింపు చర్యలకు దిగారు. అనేక సందర్భాల్లో బండారు నేరుగానే విమర్శలు చేయడం, కేసులు పెట్టించడం వంటివి చేశారు. బండబూతులతో తూలనాడిన సందర్భాలూ కోకొల్లలు.
Comments
Please login to add a commentAdd a comment