
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌తో నీచ వ్యాఖ్యలు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా తన వ్యూహాన్ని మార్చినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్‌పై విజయమ్మ, షర్మిలే దాడి చేయించారంటూ రాజేంద్రప్రసాద్ చేసిన అత్యంత దిగజారుడు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ.. టీడీపీ నేత జూపూడి ప్రభాకర్‌రావు మీడియా ముందుకు వచ్చారు.
ఇంత తీవ్రమైన వ్యవహారం నడుస్తున్నప్పుడు జోక్‌లు చేయడం సరికాదని రాజేంద్రప్రసాద్‌కు జూపూడి హితవు పలికారు. ఎమ్మెల్సీ మాట్లాడిన తీరు సినిమాల్లో బ్రహ్మానందం కామెడి చేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజేంద్రప్రసాద్ వ్యవహరించిన తీరు మొత్తం వ్యవహారాన్ని తప్పదోవ పట్టించేదిగా ఉందని విమర్శలు గుప్పించారు. బాధ్యతగల పదవిలో ఉన్న రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేయాలనీ, ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకోవాలో పార్టీ నిర్ణయిస్తుందని జూపుడి చెప్పుకొచ్చారు. అయితే, రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో చంద్రబాబే జూపూడితో మాట్లాడించారని, రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని జూపూడితో చెప్పించి.. ఈ వ్యాఖ్యల నుంచి దూరం జరిగేందుకు చంద్రబాబు ప్రయత్నించారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment