సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల ముందు ప్రతిపక్ష టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్ వైఎస్సార్‌సీపీలో చేరారు. విశాఖ టీడీపీ అర్బన్ అధ్యక్షుడు వ్యవహరించిన రెహమాన్ గత ఏడాది డిసెంబర్ 26న టీడీపీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలను స్వాగతిస్తున్నానని అన్నారు. విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ప్రకటించిన రోజే సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపానని గుర్తుచేశారు. తన సతీమణి మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశారని.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు చేస్తున్న మద్య విధానం వల్ల ఎంతో మేలుచేస్తోందని అభినందించారు. (టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా)
పదవుల కోసం పార్టీలో చేరలేదని మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు చేరారని ఎస్‌ఏ రెహమాన్ స్పష్టం చేశారు. విశాఖపట్నం మేయర్ పీఠాన్ని ఖచ్చితంగా వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రెహ్మాన్ గతంలో స్వాగతించిన విషయం తెలిసిందే. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న టీడీపీకి ఎన్నికల అనంతరం కీలక నేతలంతా గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా రాజీనామా చేసి చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. (రెహమాన్ టీడీపీకి రాజీనామా)
ఇక సీఎం వైఎస్ జగన్ తీసుకున్న పాలనా వికేంద్రీకరణ నిర్ణయంతో టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు అధినేత చంద్రబాబు వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల పోరును నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. దీంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారైంది టీడీపీ పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment