
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ రాని అసంతృప్త నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై అసమ్మతి జెండా ఎగురవేస్తున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో సొంత అభ్యర్థులపై రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో గులాబీ దండులో గుబులు మొదలైంది. నియోజకవర్గాల వారీగా అసమ్మతి వ్యవహారానికి సంబంధించిన అప్‌డెట్స్ ఇవి..
- టీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలు నాయక్ అసమ్మతి జెండా ఎగురవేశారు. దేవరకొండ నియోజకవర్గం టికెట్ తనకు కాకుండా రవీంద్రనాయక్ ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తన అనుచరులతో బాలు నాయక్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ సొంత పార్టీ కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. రెండు మూడు రోజుల్లో బాలు నాయక్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.
- నాగార్జున సాగర్ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో ‘రెబెల్స్’ పోరు ఉధృతమవుతోంది. సాగర్ టికెట్ నోముల నర్సింహయ్యకు కేటాయించడంతో టికెట్‌పై ఆశించి భంగపడ్డ కోటిరెడ్డి వర్గం భగ్గుమంటోంది. రెండు వేల మంది అనుచరులతో కోటిరెడ్డి సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
-
వరంగల్ అర్బన్‌లో కొండా సురేఖ దంపతులకు టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్‌ఎస్‌లో వర్గపోరుకు తెరలేచింది. ఈ నేపథ్యంలో ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం, కేసీఆర్ ఆదేశాలే తమకు శిరోధార్యమని, కొండా దంపతులకు తాము అండగా నిలువబోమని కార్యకర్తలు స్పష్టం చేశారు.
-
మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. మహబూబాబాద్ టిక్కెట్‌ను ఉద్యమకారులకు ఇవ్వాలంటూ టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మహబూబాబాద్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాగా, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు.
-
జనగామ జిల్లా : స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు వత్యిరేకంగా అసమ్మతి సెగ రాజుకుంటోంది. ఆయనకు వ్యతిరేకంగా చిల్పూర్ మండలం పల్లగుట్ట శివారులో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. స్టేషన్ ఘనపూర్ అభ్యర్థిని మార్చాలని కార్యకర్తలు సమావేశంలో డిమాండ్ చేశారు.