ఓటిక్కడ.. ఓటరక్కడ | Telangana electoral campaign in Andhra | Sakshi
Sakshi News home page

ఓటిక్కడ.. ఓటరక్కడ

Nov 28 2018 3:06 AM | Updated on Nov 28 2018 8:41 AM

Telangana electoral campaign in Andhra - Sakshi

‘హలో..నేను శేరిలింగంపల్లి అభ్యర్థిని మాట్లాడుతున్నాను.. మీ ఓటు మా పార్టీకే వేయండి’ అని అమరావతిలో ఉన్న ఓ వ్యక్తికి ఫోన్‌ రావడంతో అవాక్కయ్యాడు.
‘మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. ఇట్లు మీ కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ అభ్యర్థి’ ఈ సందేశం చదివాక విజయవాడలో ఓ వ్యక్తి అయోమయంలో పడ్డాడు.

తెలంగాణ ఎన్నికలకు ఆంధ్రాలో ప్రచారమేంటి.. అనుకుంటున్నారా? ఎన్నికల ప్రచారానికి అభ్యర్థులు ఆశ్రయిస్తున్న ఆధునిక పద్ధతులే ఇందుకు కారణం. అసలు విషయం ఏంటంటే.. ఐవీఆర్‌ ద్వారా రికార్డు సందేశాలను, వాట్సాప్, ఎస్సెమ్మెస్‌ ద్వారా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని అభ్యర్థులు  ప్రచారం చేసుకుంటున్నారు. ఈ కారణంగా ఇందులో చాలా ఫోన్లు, సందేశాలు ఏపీకి వెళుతున్నాయి.

కారణం ఏంటి?
తెలంగాణలో.. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఆంధ్రా  ప్రాంతానికి చెందినవారు అధికంగా స్థిరపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే.. వీరంతా అటు తమ సొంత జిల్లాల్లో, ఇటు హైదరాబాద్‌లోని తమ నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకున్నారు. ఇలాంటి ఓటర్లు దాదాపు 20 లక్షలకుపైగానే ఉంటారు. వృత్తి, ఉపాధి, వ్యాపారం, స్థానికత తదితర కారణాల వల్ల రాష్ట్ర విభజన నేపథ్యంలో వీరిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, చిన్నవ్యాపారులు, పారిశ్రామిక కూలీలు తిరిగి ఏపీకి వెళ్లిపోయారు. వీరందరి ఫోన్లలో ఇపుడు తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 

ఎవరు చేస్తున్నారు?
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, ఎల్‌బీనగర్, జూబ్లీహిల్స్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో సెటిలర్లు అధికంగా ఉన్నారు. ఏపీలో రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకోవడంతో అమరావతి పరిసర ప్రాంతాలవారు, కొత్త పరిశ్రమలు నెలకొల్పాలన్న ఆశతో ఎంట్రాప్రెన్యూర్లు, ఇలా రకరకాల కారణాలతో రాజధానిని వీడారు. వీరందరి ఫోన్లకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పొద్దుపోయే దాకా ఏదో ఒక సమయంలో సందేశాలు, రికార్డెడ్‌ వాయిస్‌కాల్స్‌ వస్తున్నాయి. మరోవైపు ఇలాంటి ఓట్లను తొలగించాలని ఏపీలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గతవారం విచారణకు వచ్చిన సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న దాదాపు 19 లక్షల ఓట్లపై విచారణ జరిపిస్తామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియా న్యాయస్థానానికి హామీ ఇచ్చారు.

2024 వరకు ఇంతే..
రాష్ట్ర విభజనకు ముందు ఏపీ తెలంగాణ రెండూ ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ పరిధిలోనే ఉండేవి. తరువాత రెండుగా విడిపోయాయి. కానీ, సర్కిల్‌ పరిధిలో ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం.. 2024 వరకు ఈ రెండు ప్రాంతాల్లో ఎలాంటి రోమింగ్‌ చార్జీలు పడవు. ఈ కారణంగా అభ్యర్థులు వివిధ మార్గాల ద్వారా తాము సేకరించిన ఫోన్‌ నంబర్లకు ప్రచార సందేశాలు పంపుతుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. రెండుచోట్లా ఓట్లు ఉండటం, ఏపీ తెలంగాణకు 2024 దాకా రోమింగ్‌ చార్జీలు పడకపోవడమూ మరో కారణం. అయినా, ఇపుడు దాదాపు అన్ని మొబైల్‌ నెట్‌వర్క్‌లు దేశవ్యాప్తంగా ఒకే రకమైన కాల్‌ఛార్జీలు వసూలు చేయడం కూడా వీరికి కలిసివస్తోంది. 

ముంపు మండలాలదీ అదే పరిస్థితి!
విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ముంపు ప్రాంతాలుగా పరిగణిస్తూ ఏపీకి కేంద్రం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడు మండలాలు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అంతర్భాగంగా ఉండేవి. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం అంతా, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలు, పినపాక పరిధిలోని బూర్గంపాడు, అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. ఈ ఏడు మండలాల్లో 211 గ్రామాలు, 34 వేల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఓటర్లను కూడా భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట నుంచి పోటీ పడుతోన్న వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమకు ఓటువేసి గెలిపించాలని ఎస్సెమ్మెస్‌లు, వాయిస్‌కాల్స్‌ ద్వారా కోరుతున్నారు. 34వేల కుటుంబాల్లో దాదాపు 1.20 లక్షల ఓట్లు ఉండొచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement