
సాక్షి, హైదరాబాద్: ఆదాయాన్ని పెంచుతాం, సంక్షేమాన్ని పంచుతాం... ఇప్పుడు టీఆర్‌ఎస్ నినాదం ఇదే. సంక్షేమ పథకాలనే ఎన్నికల ఎజెండాగా టీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహం రచించింది. నాలుగేళ్ల మూడు నెలల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ ఓటు బ్యాంకును సుస్థిరం చేస్తోందని టీఆర్‌ఎస్ భావిస్తోంది. నాలుగు పార్టీలతో ఏర్పడిన ప్రజాకూటమిని సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓటు బ్యాంకుతోనే ఢీ కొడతామనే ధీమాతో ఉంది. ఇలా వంద సీట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రహదారుల అభివృద్ధితోపాటు 119 కీలక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ‘ఆసరా’ పేరుతో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు, నేతన్నలు, కల్లుగీత కార్మికులకు పింఛన్లు... కార్మికులకు భృతి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్స్, వ్యవసాయ రుణ మాఫీ, రైతు బంధు, రైతు బీమా, సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం, కేసీఆర్ కిట్, భూరికార్డుల ప్రక్షాళన, బతుకమ్మ చీరలు వంటి కీలక పథకాలను అమలు చేస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2018 వరకు ఏటా సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని గణనీయంగా పెంచిందని, అదే ఇప్పుడు ఎన్నికలలో కలిసి వస్తుందనే ధీమాతో ఉంది.
అసెంబ్లీ రద్దుకు ముందే కసరత్తు..
అసెంబ్లీ రద్దుకు ముందే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను పథకాల వారీగా ప్రభుత్వం సేకరించింది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల జాబితాను రూపొందించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలను పొందినవారు ప్రతి కుటుంబంలో కనీసం ఇద్దరు ఉన్నారని ప్రభుత్వ నివేదిక చెబుతోంది. వ్యవసాయ కుటుంబాల్లో అయితే నాలుగు పథకాలు వర్తించిన వారు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లు ఉంది. ప్రస్తుతం దాదాపు నాలుగు కోట్లు ఉన్నట్లు అంచనా. తెల్లకార్డు ఉన్న కుటుంబాలు కోటి వరకు ఉన్నాయి. వీటన్నింటికీ రేషన్ సరుకులే కాకుండా ప్రభుత్వంలో ఏదో ఒక పథకం చేరింది. రుణ మాఫీ, రైతు బంధు పథకాలకు పేద కుటుంబాలు అనే అర్హత లేదు. కేసీఆర్ కిట్, సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ వంటివి కలిపితే లబ్ధిదారుల కుటుంబాల సంఖ్య కోటి కంటే ఎక్కువే ఉందని టీఆర్‌ఎస్ లెక్కలు వేసింది. ఈ వంతున ప్రభుత్వంతో లబ్ధి పొందిన కోటి కుటుంబాల మద్దతుపై టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. ప్రభుత్వం ముందుగా సిద్ధం చేసిన జాబితాను అభ్యర్థులకు పంపించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారంలో ప్రతీ గ్రామంలోనూ సంక్షేమ పథకాల జాబితాను చదివి వినిపిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్యను చెబుతూ మద్దతు కోరుతున్నారు.
ప్రతి నియోజకవర్గంలో 60 వేల మంది...
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల లబ్ధిదారులు ప్రతి నియోజకవర్గంలో సగటున 40 వేల నుంచి 80 వేల వరకు ఉన్నట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. వారి కుటుంబీకులు కచ్చితంగా పోలింగ్‌లో పాల్గొనేలా టీఆర్‌ఎస్ వ్యూహం రచించింది. తమ పాలనలో అమలు చేసిన వివిధ పథకాలతో ప్రతి పేద కుటుంబం సగటున రూ.50 వేల నుంచి రూ. రెండు లక్షల వరకు లబ్ధిపొందిందని టీఆర్‌ఎస్ నివేదికలు చెబుతున్నాయి. రైతు కుటుంబాలకు సైతం ఇదే తరహాలో మేలు జరిగిందన్నాయి. ఆసరా పింఛను లబ్ధిదారులు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. రైతు రుణ మాఫీతో 35 లక్షల మంది రైతులు, రైతు బంధుతో 58 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. వీరితోపాటు కుటుంబ సభ్యుల మద్దతు కచ్చితంగా తమకే ఉంటుందని టీఆర్‌ఎస్ లెక్కలేస్తోంది. ప్రచారంలో తమ పథకాలను వారికి గుర్తు చేస్తే గెలుపు కచ్చితమన్న టీఆర్‌ఎస్ అధిష్టానం ఆ పార్టీ అభ్యర్థులకు సూచిస్తోంది. ప్రతి లబ్ధిదారుడు పోలింగ్‌కు వచ్చేలా బూత్ స్థాయిలో పార్టీ పరంగా ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది.
పాక్షిక మేనిఫెస్టోతో...
ఇప్పటికే అమలు చేస్తున్న, చేసిన పథకాలతోపాటు పాక్షిక మేనిఫెస్టోతో మరింత మద్దతు వస్తుందని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. కేసీఆర్ అక్టోబర్ 16న పాక్షిక మేనిఫెస్టో ప్రకటించారు. అధికారంలోకి రాగానే మరోసారి రూ.లక్ష పంట రుణాలు మాఫీ చేస్తామని, రైతు బంధు సాయాన్ని ఇప్పుడున్న రూ.8 వేల నుంచి 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామని, నిరుద్యోగులకు ప్రతీ నెల రూ.3,016 భృతి ఇస్తామని ప్రకటించారు. ఇవన్నీ కలసి వచ్చి... వంద సీట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
కేసీఆర్‌కు మేనిఫెస్టో ముసాయిదా...
టీఆర్‌ఎస్ ఎన్నిల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిశారు. ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదాను కేసీఆర్‌కు అందజేశారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను మేనిఫెస్టో కమిటీ పరిశీలించి ఆ ప్రతిపాదనలతో నివేదికను రూపొందిం చింది. ఈ నివేదిక ఆధారంగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు తెలిసింది.