మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
బోనకల్ ఖమ్మం : కొంతమంది టీఆర్‌ఎస్ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులను విస్మరించి ప్రొటోకాల్ లేని వ్యక్తులు అధికారిక కార్యక్రమాలను ఎలా ప్రారంభిస్తారని, దీనిపై అసెంబ్లీలో సీఎంను నిలదీస్తానన్నారు. మండలంలోని సీతానగరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గురువారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన సీతానగరం పంచాయతీని ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీడీఓ, ఎంపీటీసీలు ప్రారంభించాల్సి ఉందన్నారు. కానీ వారిని పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు ప్రారంభించడం ఏంటని ప్రశ్నించారు.
ఎమ్మెల్యేగా పనిచేసిన కొండబాలకు ఈ విషయంలో కనీస పరిజ్ఞానం లేకపోవడం దురదృష్ట కరమన్నారు. ప్రొటోకాల్‌పై తాను కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకాధికారి రమణ, కార్యదర్శి లక్ష్మి, ఎంపీడీఓ విద్యాలతలను జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీపీ చిట్టుమోదు నాగేశ్వరావు, జెడ్పీటీసీ బాణోతు కొండ, ఎంపీటీసీ కర్లకుంట ముత్తయ్య, మాజీ సర్పంచ్ మాలెంపాటి వాణీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment